గవర్నర్‌ కోషియారీని తప్పించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాయనున్న శివసేన!

ABN , First Publish Date - 2020-10-14T21:11:01+05:30 IST

మహారాష్ట్రలోనూ వ్యవహారం ముదిరింది. గవర్నర్ కోషియారీకి, ప్రభుత్వానికి మధ్య వ్యవహారం తీవ్ర రూపం

గవర్నర్‌ కోషియారీని తప్పించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాయనున్న శివసేన!

ముంబై : మహారాష్ట్రలోనూ వ్యవహారం ముదిరింది. గవర్నర్ కోషియారీకి, ప్రభుత్వానికి మధ్య వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. ఎంతలా ముదిరిపోయిందంటే... గవర్నర్‌‌ను తొలగించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాయాలని శివసేన దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మిగతా భాగస్వామ్య పక్షాలతో చర్చించి... తుది నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. ఎన్సీపీ, కాంగ్రెస్ వైఖరి ఎలా వున్నా.... శివసేన మాత్రం గవర్నర్‌ కోషియారీని తప్పించాలన్న విషయంపై పట్టు వీడటం లేదని సమాచారం.  కోవిడ్ కారణంగా మూసేసిన ప్రార్థనా స్థలాలను తెరిచే విషయంలో గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ప్రార్థనా స్థలాలను తిరిగి తెరవాలంటూ తమకు కొందరు లేఖలు రాస్తున్నారంటూ గవర్నర్ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు.


ఈ లేఖ తదనంతరం వీరిద్దరి మధ్య వాదోపవాదాలు తీవ్రంగానే జరిగాయి. ఆ లేఖలన్నీ బీజేపీ మద్దతుదారుల నుంచే వచ్చాయని ఉద్ధవ్ ఎద్దేవా చేశారు. గవర్నర్ కోషియారీ కూడా ఉద్ధవ్‌కు అంతే ఘాటుగా బదులిచ్చారు. ‘‘హఠాత్తుగా మీరెప్పుడు సెక్యులరిస్టుగా మారిపోయారు?’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సీఎం కూడా ఘాటుగానే స్పందించారు. ‘‘లౌకికవాదం అనేది రాజ్యాంగంలో భాగం కదా... దాన్ని కాపాడతానని మీరే కదా ప్రమాణం చేశారు. ప్రజల సెంటిమెంట్లను గౌరవించడం ఎంత ముఖ్యమో... వారి జీవితాలను కూడా కాపాడటం అంతే ముఖ్యం. ఉన్నట్టుండి లాక్‌డౌన్ విధించడం ఓ తప్పు... ఉన్న ఫళంగా ఎత్తేయడమూ తప్పే..’’ అంటూ సీఎం ఉద్ధవ్ తీవ్రంగా మండిపడ్డారు. ‘హిందుత్వ’ విషయంలో తాము ఎవరి దగ్గరి నుంచీ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని, అయితే... గవర్నర్ సూచించిన దానిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామని ఉద్ధవ్ తెలిపారు. 

Updated Date - 2020-10-14T21:11:01+05:30 IST