సీబీఐకి సుశాంత్ కేసును అప్పగించడంపై ‘సామ్నా’లో శివసేన చిర్రుబుర్రులు..!
ABN , First Publish Date - 2020-08-20T19:18:39+05:30 IST
బాంద్రాలోని అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును...

ముంబై: బాంద్రాలోని అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించడంపై శివసేన చిర్రుబుర్రులాడింది. తమ అధికారిక పత్రిక ‘సామ్నా’లో ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. ఈ కేసును సీబీఐకి అప్పగించడం ముంబై పోలీసులను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేయడమేనని ‘సామ్నా’లో శివసేన చెప్పుకొచ్చింది. ముంబై పోలీసుల విచారణ తుది దశలో ఉండగా ఉన్నపళంగా ఆపించి.. బీహార్ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు సీబీఐకి ఈ కేసును అప్పగించారని శివసేన పేర్కొంది.
ముంబై పోలీసుల విచారణలో తప్పు లేదని కోర్టు గుర్తించినప్పటికీ సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించడం ఆశ్చర్యానికి గురిచేసిందని ‘సామ్నా’లో శివసేన విస్మయం వ్యక్తం చేసింది. బీహార్‌లో పలు క్రిమినల్ కేసులను సీబీఐ విచారించిందని.. ఎంతమంది అపరాధులను సీబీఐ అరెస్ట్ చేసిందని శివసేన ప్రశ్నించింది. ముంబై పోలీసులను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేసేందుకు సుశాంత్ కేసుపై రాజకీయం చేశారని శివసేన ఆరోపించింది.