ఆ పరీక్ష జరగాల్సిందే.. పాస్ చేస్తే గుర్తింపు రద్దు..

ABN , First Publish Date - 2020-09-06T17:18:47+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇంజినీరింగ్‌ విద్యార్థుల సెమిస్టర్‌ పరీక్షల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించకుంటే వర్సిటీ గుర్తింపును రద్దు చేస్తామని అన్నా విశ్వవిద్యాలయాన్ని అఖిల

ఆ పరీక్ష జరగాల్సిందే.. పాస్ చేస్తే గుర్తింపు రద్దు..

చెన్నై (ఆంధ్రజ్యోతి): కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇంజినీరింగ్‌ విద్యార్థుల సెమిస్టర్‌ పరీక్షల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించకుంటే వర్సిటీ గుర్తింపును రద్దు చేస్తామని అన్నా విశ్వవిద్యాలయాన్ని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) హెచ్చరించింది. దీంతో నాలుగు లక్షల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా పాఠశాలలు, కళాశాలలు సహా విద్యాసంస్థలన్నీ ఐదు నెలలకుపైగా మూతపడ్డాయి. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో విద్యాసంస్థలను దశలవారీగా పునఃప్రాంభించాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. విద్యాసంస్థలు మూతపడడం వల్ల టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను ప్రభుత్వం సకాలంలో జరపలేకపోయింది. చివరకు హైకోర్టు జోక్యం చేసుకోవడంతో పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్టు ప్రకటించింది. అదేవిధంగా యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ప్రతిపాదనల మేరకు సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కళాశాలలు, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులలో ఆఖరి సంవత్సరం మినహా పెండింగ్‌లో ఉన్న సెమిస్టర్‌ పరీక్షలను రాష్ట్రప్రభుత్వం రద్దు చేసింది. ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ సెమిస్టర్‌ పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులయ్యారు. 


ఆఖరి సంవత్సరం సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపడున్న నేపథ్యంలో ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థుల అరియర్‌ సెమిస్టర్‌ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అంగీకరించే ప్రసక్తే లేదని ప్రకటించింది. ఇంజినీరింగ్‌ కళాశాలలను నిర్వహిస్తున్న అన్నా విశ్వవిద్యాలయం ఏఐసీటీఈ ఆధీనంలోనే నడుస్తోంది. ఆ కారణంగా ఇంజనీరింగ్‌ అరియర్‌ సెమిస్టర్‌ పరీక్షల రద్దు నిర్ణయాన్ని ఉపసహంరించకుంటే ఆ విశ్వవిద్యాలయం గుర్తింపునే రద్దు చేస్తామని ఏఐసీటీఈ హెచ్చరించింది. ఈ మేరకు ఏఐసీటీఈ చైర్మన్‌ అనిల్‌ సహస్రపుత్‌ అన్నా విశ్వవిద్యాలయానికి ఓ సర్కులర్‌ పంపారు. అన్నా విశ్వవిద్యాలయం వీసీ సూరప్పకు రాసిన ఆ లేఖలో ఇంజినీరింగ్‌ కాలేజీలలో ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు మినహా తక్కిన విద్యార్థులందరినీ ఫస్ట్‌ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ సెమిస్టర్‌ పరీక్షలు జరుపకుండా ఉత్తీర్ణులైనట్టు ప్రకటించడాన్ని, పరీక్షలు రాయ కుండా మార్కులు వేయడాన్ని, పట్టాలు ప్రదానం చేయడాన్ని అంగీకరించమని స్పష్టం చేశారు. అంతేకాకుండా సెమిస్టర్‌ పరీక్షలు రాయకుండా ఉత్తీర్ణులైన విద్యార్థులు  పొందే డిగ్రీలను ఏ సాంకేతిక సంస్థ కూడా అంగీకరించదని హెచ్చరించారు. పరీక్షలు రాయకుండా ఉత్తీర్ణులైన విద్యార్థులను ఉన్నత విద్యలో ప్రవేశించకుండా అడ్డుకుంటామని కూడా స్పష్టం చేశారు. 


అరియర్స్‌ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ఉత్తీర్ణులైనట్టు ప్రకటిస్తే అన్నా విశ్వవిద్యాలయం గుర్తింపును రద్దు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏఐసీటీఈ చైర్మన్‌ రాసిన ఈ లేఖ అన్నాయూనివర్శిటీ ఆధీనంలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న 4లక్షలా1226 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులను దిగ్ర్భాంతికి గురిచేసింది. ఇక ఏఐసీటీఈ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మాజీ వీసీ బాలగురుసామి స్వాగతించారు. అన్నా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ సూరప్ప కూడా ఏఐసీటీఈ నిర్ణయానికి సానుకూలత ప్రకటించి నట్టు తెలుస్తోంది. అయితే ఉన్నతవిద్యాశాఖ మంత్రి అన్బళగన్‌ ఏఐసీటీఈ రాసిన లేఖ గురించి తమకు తెలియదని, అన్నా వర్శిటీ వీసీ సెమిస్టర్‌ పరీక్షల రద్దును వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఆగస్టు 31న  యూజీసీ ప్రతిపాదనల మేరకే సెమిస్టర్‌ పరీక్షలను రాష్ట్రప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్లు ప్రకటించిన ఏఐసీటీఈ ఉన్నట్టుండి దానికి వ్యతిరేకంగా ఎలా లేఖ రాస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఇంజినీరింగ్‌ విద్యార్థుల సెమిస్టర్‌ పరీక్షల రద్దును వ్యతిరేకిస్తూ తిరుచ్చెందూరుకు చెందిన న్యాయవాది రామ్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వచ్చే వారం ఆ పిటిషన్‌పై విచారణ జరుగనున్న నేపథ్యంలో ఏఐసీటీఈ పరీక్షల రద్దును వ్యతిరేకిస్తూ అన్నా యూని వర్శిటీకి హెచ్చరిక జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది.

Updated Date - 2020-09-06T17:18:47+05:30 IST