కాశ్మీర్‌కు అభివృద్ధి కళ.. 3 గంటల ప్రయాణం ఇక 15 నిముషాలలో!

ABN , First Publish Date - 2020-09-14T23:12:03+05:30 IST

ఒకప్పడు నదికి అటు నుంచి ఇటు రావాలంటే దాదాపు 3 గంటల ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఆ ప్రయాణం కేవలం 15నిముషాలకు పరిమితమైంది. కాశ్మీర్‌లో కేంద్రం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు...

కాశ్మీర్‌కు అభివృద్ధి కళ.. 3 గంటల ప్రయాణం ఇక 15 నిముషాలలో!

శ్రీనగర్: ఒకప్పడు నదికి అటు నుంచి ఇటు రావాలంటే దాదాపు 3 గంటల ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఆ ప్రయాణం కేవలం 15నిముషాలకు పరిమితమైంది. కాశ్మీర్‌లో కేంద్రం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇదో నిదర్శనం. జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తరువాత కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ముఖ్యంగా చిన్న చిన్న ప్రాంతాలను, గ్రామాలను, పంచాయతీల్లో రహదారులను నిర్మించడం, ఆయా ప్రాంతాలను కలుపుతూ వంతెనలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేస్తోంది. పేదలకు పీఎంఏవై తరపున నివాసాలను కూడా కల్పిస్తోంది.


జమ్మూ కాశ్మీర్‌లో కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీకి, ఆయన ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటామని చెబుతున్నారు. ఇన్నేళ్లుగా తాము అనుభవిస్తున్న కష్టాలు ఒక్కొక్కటిగా తీరుతున్నాయని, తమ ప్రాంతాలు అభివృద్ధి చెందడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. స్థానిక గ్రామాల్లో రోడ్లంటే తెలియని ప్రాంతాలకు కూడా నేడు రోడ్లు వేస్తున్నారని, దీనివల్ల పిల్లల చదువులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


రోడ్లు, వంతెనల నిర్మాణంపై స్థానిక అధికారి ఒకరు మాట్లాడుతూ, నిర్మాణాలలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ప్రాంతాల్లో మంచు పడుతుందని, కొంద చరియలు జారిపడుతుంటాయని, అలాంటి సమయంలో నాసిరకమైన నిర్మాణాలు దెబ్బతింటాయని, అందుకే నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నిర్మాణం జరిగేలా చూస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పేదలందరికీ అందజేసేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నామని, నెలాఖరులోగా అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాంతాల్లో పేదల అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న ప్రతి సాయాన్ని వారికి అందించడమే తమ కర్తవ్యమని, అందుకోసం కలిసికట్టుగా పనిచేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2020-09-14T23:12:03+05:30 IST