ఎన్నికల ప్రచారాస్త్రంగా 370 అధికరణ రద్దు: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2020-09-17T23:32:49+05:30 IST

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను మోదీ ప్రభుత్వం రద్దు చేయడం..

ఎన్నికల ప్రచారాస్త్రంగా 370 అధికరణ రద్దు: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను మోదీ ప్రభుత్వం రద్దు చేయడం బీహార్ అసెంబ్లీ బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రాల్లో ఒకటిగా ఉంటుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ అన్నారు. గురువారంనాడునాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ, జమ్మూ కశ్మీర్‌లో 370 అధికారణను రద్దు చేస్తానని ప్రధాని మోదీ గతంలో వాగ్దానం చేశారని, అందుకు అనుగుణంగా గత ఏడాది ఆ అధికరణను రద్దు చేశారని చెప్పారు. బీహార్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రాల్లో నిస్సందేహంగా ఇదొకటని ఆయన తెలిపారు.


'దేశవ్యాప్తంగా దాదాపు అన్ని గృహాలకు విద్యుత్ అందించేందుకు మోదీ కృషి చేశారు. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఏ ప్రధాని అయినా మోదీలా ఆలోచించగలిగారా?. పేదలకు పక్కా గృహాల ఇవ్వాలని ప్రధాని నిర్ణయించారు. కోటి 40 లక్షల ఇళ్లు కట్టారు. ఆరు నెలల పాటు ఉచిత ఆహారధాన్యాలు సరఫరా చేసిన విషయం, జన్‌ధన్ అకౌంట్లలో డబ్బులు వేయడం ప్రజలందరికీ తెలుసు' అని ఆర్‌కే సింగ్ అన్నారు.


కాగా, 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ కాల పరిమితి నవంబర్ 29వ తేదీతో ముగియనుంది. దీనికి ముందే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల తేదీలను మాత్రం ప్రకటించాల్సి ఉంది.

Updated Date - 2020-09-17T23:32:49+05:30 IST