కరోనా వ్యాక్సిన్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్.. ఇప్పుడు సవాల్ ఇదేనట!

ABN , First Publish Date - 2020-12-13T16:41:42+05:30 IST

కరోనా టీకా పంపిణీకి అతి పెద్ద సవాలు ఏంటంటే..

కరోనా వ్యాక్సిన్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్.. ఇప్పుడు సవాల్ ఇదేనట!

వాషింగ్టన్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఈ వైరస్‌ను నియంత్రించడం కోసం ప్రపంచ దేశాలు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వ్యాక్సీన్లు తయారు చేయడానికి బడా బడా ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటిలో అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయాన్‌టెక్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ రెండు కంపెనీలూ కలిసి ఓ కరోనా వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేశాయి. క్లినికల్ ట్రయల్స్ సమయంలో ఈ వ్యాక్సీన్ 90శాతంపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు కనిపించింది. దీంతో ఈ వ్యాక్సీన్ కరోనాను నియంత్రించ గలదని చాలా దేశాలు నమ్మాయి. ఇదే సమయంలో యూరప్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. దీంతో ఆందోళన చెందిన పలు దేశాలు ఈ వ్యాక్సీన్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాలనే ఆలోచన చేశాయి.


కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడిన ప్రాంతాల్లో యూరప్ ఒకటి. ఇక్కడ ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల్లో విపరీతంగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భయపడిన ఆయా ప్రభుత్వాలు కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని అనుమానం రాగానే మరోసారి లాక్‌డౌన్లు, నైట్ కర్ఫ్యూల వంటి నిబంధనలు విధించాయి. అయితే వీటన్నింటిలో ధైర్యంగా ఆలోచించిన బ్రిటన్ దేశం.. ప్రజలందరికీ కరోనా వ్యాక్సీన్ వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫైజర్ కంపెనీతో ఒప్పందం చేసుకొంది. ఫైజర్-బయాన్ టెక్ సంస్థలు సంయుక్తంగా సిద్ధం చేసిన వ్యాక్సీన్‌ను దేశ ప్రజలందరికీ ఇస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్వయంగా ప్రకటించారు. దీంతో చాలామంది భారతీయులు కూడా కేవలం వ్యాక్సీన్ వేయించుకోవడానికే యూకే బయలు దేరారనడం అతిశయోక్తి కాదు.


ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన అగ్రరాజ్యం అమెరికా కూడా తాజాగా ఫైజర్ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై బయాన్‌టెక్ సీఈవో ఉగుర్ సాహిన్ మాట్లాడారు. అమెరికా నుంచి కూడా తమ వ్యాక్సీన్‌కు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పుడు తమ ముందు ఒకే ఒక్క సమస్య ఉందని సాహిన్ చెప్పారు. అదే వ్యాక్సిన్ ఉత్పత్తి అని ఆయన అన్నారు. బ్రిటన్, అమెరికా దేశాల్లో వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించడంతో.. ఆయా దేశాలకు సప్లై చేసే స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి జరగాల్సి ఉంది. అయితే దీనిపై తమ కంపెనీ చాలా కసరత్తు చేస్తోందని సాహిన్ తెలిపారు. వచ్చే ఏడాదికల్లా 130 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయడానికి తాము ప్లాన్ వేశామని, ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే యూరప్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తి షురూ చేస్తామని వెల్లడించారు.

Updated Date - 2020-12-13T16:41:42+05:30 IST