కేంద్రం, టెలికాం కంపెనీలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ABN , First Publish Date - 2020-03-18T22:56:36+05:30 IST

అడ్జస్టెడ్ గ్రాస్ రెవిన్యూ (ఏజీఆర్) బాకీలను స్వీయ మదింపు చేయడానికి టెలికాం సంస్థలకు అనుమతి ఇచ్చిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ)పై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.

కేంద్రం, టెలికాం కంపెనీలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ : అడ్జస్టెడ్ గ్రాస్ రెవిన్యూ (ఏజీఆర్) బాకీలను స్వీయ మదింపు చేయడానికి టెలికాం సంస్థలకు అనుమతి ఇచ్చిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ)పై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్‌ను లెక్కించేందుకు మరోసారి ప్రయత్నించవద్దని స్పష్టం చేసింది. ఈ విధంగా స్వీయ మదింపు చేయడం కోర్టును మోసగించడమవుతుందని తెలిపింది. ఈ చర్యను ఉపసంహరించుకోవాలని డీఓటీని ఆదేశించింది. 


బాకీలను స్వీయ మదింపు చేయడానికి టెలికాం ఆపరేటర్లకు అనుమతించిన డీఓటీ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు కాదా? అని జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రశ్నించారు. ఆదేశాలను ప్రతి కంపెనీ ఉల్లంఘిస్తోందని, తన కళ్లు కప్పేందుకు ప్రయత్నిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. తనను ప్రభావితం చేసేందుకు మీడియాను ఉపయోగించుకుంటోందని, దీనిని సహించేది లేదని స్పష్టం చేసింది. 


‘‘మేం అమాయకులమా? మా కన్నా అధికులమని డీఓటీ అధికారులు భావిస్తున్నారా? ఈ కంపెనీలు చర్యలకు అతీతమైనవా? ప్రతి ఒక్కరూ మమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వార్తా పత్రికలు వ్యాసాల మీద వ్యాసాలు రాస్తున్నాయి. అయినప్పటికీ మేం లొంగబోము’’ అని జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. 


సొమ్ము చెల్లింపుకు టెలికాం కంపెనీలకు సమయం ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ కోరడంతో సుప్రీంకోర్టు అందుకు అంగీకరించింది. తదుపరి విచారణ రెండు వారాల తర్వాత జరుగుతుందని పేర్కొంది. 


అక్టోబరు 24న తాను ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పులో ఏ బాకీలు చెల్లించాలో స్పష్టంగా వివరించినప్పటికీ, టెలికాం కంపెనీలు పదే పదే తనను ఆశ్రయిస్తున్నాయని, వివరణ కోరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బాకీల సొమ్మును డీఓటీ లెక్క తేల్చిందని, దానిపైనే కేసులో వాదోపవాదాలు జరిగాయని వివరించింది. 


స్వీయ మదింపునకు అవకాశం ఇవ్వడమంటే సమీక్షించడం మాత్రమే కాదని, యావత్తు తీర్పును తిరిగి తెరవడమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వీయ మదింపు ద్వారా తేలిన సొమ్మును 8 నుంచి 10 నెలల్లో ధ్రువీకరిస్తామని టెలికాం కంపెనీలు చెప్పినప్పటికీ, అది కోర్టు ధిక్కారమవుతుందని తెలిపింది. 


అడ్జెస్టెడ్ గ్రాస్ రెవిన్యూస్ (ఏజీఆర్)కు ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.  పద్నాలుగేళ్ళ సుదీర్ఘ న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు తెర దించింది. దీంతో టెలికాం సంస్థలపై భారీ భారం పడింది. టెలికాం డిపార్ట్‌మెంట్ అంచనా ప్రకారం వొడాఫోన్ ఐడియా రూ.58,254 కోట్లు చెల్లించవలసి ఉంది. ఇది వడ్డీ, జరిమానాలతో కలిపిన మొత్తం. అయితే ఈ కంపెనీ తాను రూ.21,533 కోట్లు మాత్రమే చెల్లించవలసి ఉందని చెప్తోంది. ఇప్పటి వరకు ఈ సంస్థ రూ.6,854 కోట్లు చెల్లించింది. 


ఇదే విధంగా భారతి ఎయిర్‌టెల్, టాటా టెలీ సర్వీసెస్ భారీ మొత్తాల్లో చెల్లించవలసి ఉంది. 


Updated Date - 2020-03-18T22:56:36+05:30 IST