సుప్రీం కోర్టులో అనిల్ అంబానీకి ఊరట

ABN , First Publish Date - 2020-09-17T23:30:43+05:30 IST

సుప్రీం కోర్టులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి కొంత ఊరట లభించింది. అనిల్ అంబానీ వ్యక్తిగత హామీగా...

సుప్రీం కోర్టులో అనిల్ అంబానీకి ఊరట

సుప్రీం కోర్టులో ఎస్‌బీఐ పిటిషన్ కొట్టివేత

అనిల్ అంబానీకి కొంత ఊరట

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి కొంత ఊరట లభించింది. అనిల్ అంబానీ వ్యక్తిగత హామీగా ఉన్న కార్పొరేట్ రుణాలు వసూలు కాకపోవడంతో ఎస్‌బీఐ దివాలా చర్యలకు దిగాలని భావించిన విషయం తెలిసిందే. అనిల్ అంబానీపై వ్యక్తిగత దివాలా, దివాలా కోడ్(ఐబీసీ) కింద చర్యలు తీసుకునేందుకు, ఆయనపై ఎస్‌బీఐ దాఖలు చేసిన దివాలా పిటిషన్‌పై గతంలో ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఎస్‌బీఐ తాజాగా సుప్రీంను ఆశ్రయించింది. అయితే.. ఎస్‌బీఐ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం తిరస్కరించింది.


అక్టోబర్ 6న ఈ అంశంపై విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌లో మార్పులు కోరేందుకు ఎస్‌బీఐకి స్వేచ్ఛ ఉందని సుప్రీం స్పష్టం చేసింది. అడాగ్ గ్రూప్‌‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ లిమిటెడ్.. 2016లో ఎస్‌బీఐ నుంచి తీసుకున్న రూ.1200 కోట్ల కార్పొరేట్ రుణాలపై అనిల్ అంబానీ వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఇవి మొండి బకాయిలుగా మారడంతో దివాలా చట్టం ప్రకారం అనిల్ అంబానీ నుంచి ఈ డబ్బును వసూలు చేయాలని ఎస్‌బీఐ శతవిధాలా ప్రయత్నిస్తోంది.

Updated Date - 2020-09-17T23:30:43+05:30 IST