ఎక్కువ కూల్ వద్దు
ABN , First Publish Date - 2020-04-26T06:46:41+05:30 IST
ఓవైపు కరోనా కల్లోలం.. మరోవైపు వేసవితో మండుతున్న ఎండలు. లాక్‌డౌన్‌తో ఇళ్లలోనే ఉంటున్న ప్రజలు.. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగాన్ని పెంచేశారు. ఆస్పత్రులు, కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి...

- ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకంపై కేంద్రం మార్గదర్శకాలు
- ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల మధ్య ఉండాలి
- గాలిలో తేమ 40-70 శాతం ఉండేలా చూడాలి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఓవైపు కరోనా కల్లోలం.. మరోవైపు వేసవితో మండుతున్న ఎండలు. లాక్‌డౌన్‌తో ఇళ్లలోనే ఉంటున్న ప్రజలు.. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగాన్ని పెంచేశారు. ఆస్పత్రులు, కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న ప్రదేశాల్లో కరోనా ఎక్కువకాలం మనుగడ సాగిస్తుందని, ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ.. దాని జీవన కాలం తగ్గుతుందని చైనాలో జరిగిన పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్ రిఫ్రిజిరేటింగ్ అండ్ కండిషనర్ ఇంజినీర్స్(ఐఎ్‌సహెచ్‌ఆర్‌ఏఈ) సూచనల మేరకు.. కేంద్ర ప్రజాపనుల శాఖ(సీపీడబ్ల్యూడీ) మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఏసీల వినియోగానికి ఇవీ మార్గదర్శకాలు..
- గదిలో ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల మధ్య ఉండేలా జాగ్రత్త పడాలి
- గాలిలో తేమ స్థాయి 40-70ు మధ్య ఉండాలి. పొడివాతావరణంలో గాలిలోని తేమ తగ్గిపోతుంది. దీన్ని ఎప్పటికప్పుడు గమనించాలి. తేమ తగ్గకుండా ఉంటే.. క్రిములను నిలువరించవచ్చు.
- ఏసీలు పనిచేస్తున్నా.. బయటి నుంచి గాలి వచ్చేలా, ఇంట్లోని గాలి బయటకు వెళ్లేలా కిటికీలను కొద్దిగా తెరిచి పెట్టడం మంచిది. ఏసీలు వాడకుంటే తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు తెరిచి ఉంచాలి.
- స్ప్లిట్ ఏసీ ఫిల్టర్లను.. కార్యాలయాల్లోని సెంట్రలైజ్డ్ ఏసీల డక్ట్‌లను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.
- కమర్షియల్ ప్రాంతాల్లో.. 70-80శాతం బయటి గాలి లోనికి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎయిర్ కూలర్లు వాడితే..
- కూలర్లు బయటి గాలిని పీల్చేలా జాగ్రత్తపడాలి. కూలర్‌ను గది తలుపు లేదా, కిటికీ దగ్గరపెట్టాలి.
- కూలర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు క్రిమిసంహారకాలతో శుభ్రం చేసుకోవాలి.
- తరచూ నీటిని ఖాళీ చేసి, మళ్లీ నింపుకోవాలి.
- కూలర్లను వినియోగిస్తున్నా.. తేమ బయటకు వెళ్లేలా కిటికీలను తెరిచే పెట్టాలి.
- బయటి గాలిని పీల్చుకోలేని పోర్టబుల్ కూలర్లను వాడకూడదు.
ఫ్యాన్ల వినియోగం..
- ఫ్యాన్లు వినియోగించేవారు కిటీకీలను కొద్దిగానైనా తెరిచి ఉంచాలి.
- ఫ్యాన్ వాడే గదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే.. వెంటిలేషన్ కోసం దాన్ని ఆన్ చేసి పెట్టడం మంచిది.
వైరస్ మనుగడ ఇలా..
- ఉష్ణోగ్రత 4 డిగ్రీల వద్ద ఉంటే.. కరోనా వైరస్ 14 రోజులపాటు మనుగడ సాగించగలదు.
- 37 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కరోనా వైరస్ కేవలం ఒక రోజు మనుగడ సాగిస్తుంది.
- 56 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఈ వైరస్ అరగంట కంటే ఎక్కువ సేపు మనుగడ సాగించలేదు.