మమతకు సౌగత రాయ్ షాకిస్తారా..?

ABN , First Publish Date - 2020-11-21T22:06:39+05:30 IST

ఐదుగురు టీఎంసీ ఎంపీలు ఏ క్షణంలోనైనా రాజీనామా చేసే అవకాశం ఉందని..

మమతకు సౌగత రాయ్ షాకిస్తారా..?

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) దిగ్గజ నేత సౌగత రాయ్ ఆ పార్టీని వీడే అవకాశాలున్నాయని బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ జోస్యం చెప్పారు. ఐదుగురు టీఎంసీ ఎంపీలు ఏ క్షణంలోనైనా రాజీనామా చేసే అవకాశం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. నార్త్ 24 పరగణాల జిల్లాలో ఛాత్ పూజలో పాల్గొన్న అర్జున్ సింగ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.


'సౌగత్ రాయ్ టీఎంసీ నేతగా, మమతా బెనర్జీ మధ్యవర్తిగా కెమెరా ముందు కనిపిస్తున్నారు. మరోవైపు సువేందు అధికారితో కూడా సంప్రదింపులు సాగిస్తున్నారు. కెమెరా ఎప్పుడు రోల్ అయితే అప్పుడు సౌగత్ రాయ్ పేరు కూడా వచ్చి చేరుతుంది' అని అర్జున్ సింగ్ అన్నారు. పశ్చిమబెంగాల్ మంత్రి సువేందు అధికారి తదుపరి రాజకీయ నిర్ణయంపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో అర్జున్ సింగ్ తాజా వ్యాఖ్యలు చేశారు. సువేందు అధికారి కొద్దికాలంగా టీఎంసీ నేతలకు దూరంగా ఉంటూ, పలు నెలలుగా మంత్రివర్గ సమావేశాలకు హాజరు కావడం లేదు.


నందిగావ్ ఉద్యమంలో కీలక పాత్ర..

టీఎంసీ 2007లో చేపట్టిన నందిగావ్ ఉద్యమంలో సువేందు అధికారి కీలక పాత్ర పోషించారు. ఈ ఉద్యమంతో 34 ఏళ్ల పాటు సాగిన వామపక్షాల అధికారానికి 2011లో తెరపడింది. టీఎంసీ అధికార పగ్గాలు చేపట్టింది. ఈ విషయాన్ని అర్జున్ సింగ్ మీడియాకు వివరిస్తూ, సుబేందు అధికారి జనాకర్షణ గలిగిన నేత అని, పార్టీ కోసం చెమెటోడ్చి పనిచేసిన అధికారి, మరి కొందరి నేతలపై ఆధారపడి మమతా బెనర్జీ నాయకురాలు అయ్యారని అన్నారు. ప్రస్తుతం ఆమె గతాన్ని విస్మరించి, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని చెయిర్‌లో (సీఎం పీఠం) కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీన్నిజనాకర్షణ కలిగిన నేతలు (మాస్ లీడర్స్) ఎవరూ ఒప్పుకోరని అన్నారు.


మరోవైపు, సుబేందు అధికారికి ఉన్న అభ్యంతరాలు తెలుసుకుని, ఆయనను సంతృప్తి పరచేందుకు, పార్టీలోనే ఉండేలా చూసేందుకు టీఎంసీ తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తోందని చెబుతున్నారు. అయితే, బీజేపీ మాత్రం రోజులు గడిచే కొద్దీ టీఎంసీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతాయని నమ్మబలుకుతోంది. 2021 ఏప్రిల్-మే నెలల్లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

Read more