కరోనా వేళ అతి తక్కువ మందితో హజ్ యాత్ర

ABN , First Publish Date - 2020-06-23T11:34:38+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న కష్టకాలంలో ఈ ఏడాది హజ్ యాత్రకు అతి తక్కువ మంది భక్తులను అనుమతించాలని సౌదీఅరేబియా సర్కారు నిర్ణయించింది.....

కరోనా వేళ అతి తక్కువ మందితో హజ్ యాత్ర

రియాద్ (సౌదీఅరేబియా): ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న కష్టకాలంలో ఈ ఏడాది హజ్ యాత్రకు అతి తక్కువ మంది భక్తులను అనుమతించాలని సౌదీఅరేబియా సర్కారు నిర్ణయించింది. జులై నెలలో జరగనున్న హజ్ కార్యక్రమంలో సౌదీఅరేబియా దేశంలో నివశిస్తున్న వివిధ దేశాలకు చెందిన అతి తక్కువ మంది భక్తులను అనుమతించాలని నిర్ణయించినట్లు సౌదీ హజ్ మంత్రిత్వశాఖ అధికారిక ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఏటా రెండు మిలియన్ల మంది హజ్ యాత్ర కోసం పవిత్ర మక్కా నగరానికి వచ్చేవారు. ఈ ఏడాది కరోనా వైరస్ ప్రబలడంతోపాటు దీనికి వ్యాక్సిన్ లేకపోవడం, సరైన చికిత్స లేకపోవడం వల్ల హజ్ యాత్రకు ఈ ఏడాది విదేశాల నుంచి భక్తులను అనుమతించరాదని సౌదీ సర్కారు నిర్ణయించింది. జీవితంలో ధనమున్న ప్రతీ ముస్లిమ్ ఒకసారి హజ్ యాత్ర చేయాలనేది ఇస్లాం మూలస్తంభాల్లో ఒకటి. ఈ ఏడాది కరోనా వైరస్ ప్రబలడం వల్ల మక్కా నగరంలో ఉమ్రా యాత్రను కూడా సౌదీ సర్కారు రద్దు చేసింది. సౌదీ అరేబియాలో 1,61,000 కరోనా కేసులు నమోదు కాగా, వీరిలో 1307 మంది మరణించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో అతి తక్కువ మంది భక్తులతో హజ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. 

Updated Date - 2020-06-23T11:34:38+05:30 IST