సత్యేంద్ర జైన్‌కు ప్లాస్మా థెరపీ

ABN , First Publish Date - 2020-06-19T23:03:11+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను సాకేత్ ఏరియాలోని మ్యాక్స్ ఆసుపత్రికి..

సత్యేంద్ర జైన్‌కు ప్లాస్మా థెరపీ

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను సాకేత్ ఏరియాలోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయనకు వైద్యులు ప్లాస్మా థెరపీ చికిత్స అందించనున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఇంతవరకూ ఆయన రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ వచ్చారు. శుక్రవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి ఒకింత ఆందోళనకరంగా మారింది. దాంతో ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్ అమర్చారు.


సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఊపిరితిత్తుల్లో న్యుమోనియా ప్యాచ్‌లు పెరిగినట్టు సీటీ స్కానింగ్ రిపోర్టు చెబుతోందన్నారు. ఆయనలో మగత, అలసట కనిపిస్తోందని, డాక్టర్ల సలహాల ప్రకారం చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. కాగా, సత్యేంద్ర జైన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ట్వీట్ చేశారు.


కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో సత్యేంద్ర జైన్ ఈ వారంలో రెండుసార్లు వైద్య పరీక్షలు చేయంచుకున్నారు. తీవ్రమైన జ్వరం, శాస్వ పీల్చుకోవడం కష్టం కావడం వంటి సమస్యలను ఆయన ఎదుర్కొంటున్నారు. బుధవారంనాడు రెండోసారి పరీక్షలు చేయించుకోవడంతో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

Updated Date - 2020-06-19T23:03:11+05:30 IST