మేం రెడీ.. మీరు?
ABN , First Publish Date - 2020-04-25T07:20:28+05:30 IST
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అనగానే చాలా మందికి క్షిపణులు, ఆధునిక యుద్ధ వ్యవస్థలు గుర్తుకొస్తాయి. కానీ, దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత.. ఈ వైర్‌సపై కూడా

- పారిశ్రామికవేత్తలకు డీఆర్‌డీవో ఆఫర్
- సాంకేతికత అందించడానికి మేం సిద్ధం
- తీసుకోవడానికి పరిశ్రమలు సిద్ధమేనా?
- వీలైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించాలి
- శానిటైజర్ల నుంచి వెంటిలేటర్ల వరకూ
- మొత్తం 23 టెక్నాలజీలు అభివృద్ధి చేశాం
- ‘ఆంధ్రజ్యోతి’తో డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అనగానే చాలా మందికి క్షిపణులు, ఆధునిక యుద్ధ వ్యవస్థలు గుర్తుకొస్తాయి. కానీ, దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత.. ఈ వైర్‌సపై కూడా డీఆర్‌డీవో యుద్ధం ప్రకటించింది. కరోనాను దీటుగా ఎదుర్కోవటానికి 23 టెక్నాలజీలను అతి తక్కువ సమయంలో అభివృద్ధి చేసింది. అంతేకాదు.. ఉత్పత్తి కోసం వాటిని ప్రైవేట్ సంస్థలకు అందించింది. ‘‘మన పరిశ్రమలకు ఇది ఒక మంచి అవకాశం. మా వద్ద ఉన్న టెక్నాలజీలను ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉత్పత్తి చేయటానికి పరిశ్రమలు సిద్ధమేనా?’’ అని ప్రశ్నిస్తున్న డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ సతీశ్‌రెడ్డితో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
ఇంత తక్కువ సమయంలో 23 టెక్నాలజీలను ఎలా అభివృద్ధి చేశారు?
యుద్ధానికి సైనికుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ప్రస్తుతం మనం కరోనాపై యుద్ధం చేస్తున్నాం. దేశ రక్షణ అంటే సరిహద్దులను కాపాడటమే కాదు. అవసరమైనప్పుడు సమాజానికి కావాల్సిన సాంకేతికతలను అభివృద్ధి చేయాలి. డీఆర్‌డీవోకి చెందిన 8 వేల మంది సిబ్బంది వైర్‌సపై యుద్ధాన్ని ప్రకటించారు. శానిటైజర్ల నుంచి ఐసీయూల్లో ఉపయోగించే వెంటిలేటర్ల దాకా పలు టెక్నాలజీలను అభివృద్ధి చేయగలిగాం. వీటన్నింటినీ ప్రైవేట్ సంస్థలకు అందిస్తున్నాం. బహుశా ప్రపంచంలో ఏ ప్రభుత్వ సంస్థ ఇంత వేగంగా స్పందించి ఉండదు.
ఈ టెక్నాలజీలను కొవిడ్-19 వ్యాప్తి తర్వాతే అభివృద్ధి చేశారా?
చాలా టెక్నాలజీలను కొవిడ్-19 వ్యాప్తి తర్వాతే అభివృద్ధి చేశాం. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. మనం దైనందిక జీవనంలో ఉపయోగించే అనేక ఉత్పత్తుల తయారీకి అవసరమైన డిజైన్లను రూపొందించడం కష్టమైన పనికాదు. వీటిలో చాలా వరకూ మేము ఇప్పటిదాకా అభివృద్ధి చేసిన వాటిలో భాగమే. ఉదాహరణకు వెంటిలేటర్లను తీసుకుందాం. మా వద్ద ఉన్న ఓ డిజైన్‌లో కొన్ని మార్పులు చేస్తే ఇవి తయారవుతాయి. అది సక్రమంగా పని చేస్తోందా? లేదా? అని చూడటం వరకే మా పని. ఆ తర్వాత బాధ్యత ప్రైవేట్‌రంగానిదే. వీలైనంత త్వరగా ఉత్పత్తి చేయగలగాలి.
దేశవ్యాప్తంగా మాస్కులు, పీపీఈ కిట్ల కొరత ఉంది కదా?
వాస్తవమే. ఎన్-99 మాస్క్‌లు, పీపీఈ కిట్ల కొరత ఉంది. వీటిని మన దేశంలోనే తయారు చేయాలన్న ఉద్దేశంతో వెంటనే డిజైన్లను రూపొందించాం. యుద్ధ ప్రాతిపదికన వాటిని ప్రైవేట్ కంపెనీలకు అందించాం. వారు ఉత్పత్తిని ప్రారంభించారు. మేము రూపొందించిన డిజైన్లతో లక్షలాది మాస్కులు, పీపీఈ కిట్లు తయారవుతున్నాయి. ఇప్పటి వరకూ 30 వేల వెంటిలేటర్లు ఉత్పత్తి చేశారు.
విదేశాల్లో ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య ఎలాంటి సహకారం ఉంటుంది?
వాటి మఽధ్య సంయుక్త కార్యాచరణ ఉంటుంది. ఉదాహరణకు అమెరికాలో వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. వెంటనే కొన్ని ఆటోమొబైల్ సంస్థలు రంగంలోకి దిగి.. వాటిని ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. చైనా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాల్లోనూ ఇలాంటి అనేక ఉదాహరణలు మనం చూడవచ్చు. వాస్తవానికి డీఆర్‌డీవో చాలా కాలంగా ప్రైవేట్ సంస్థలు, ఐఐటీలను ప్రోత్సహిస్తూ వస్తోంది. కొన్ని వేల సంస్థలు మాతో కలిపి పని చేస్తున్నాయి. కొవిడ్-19 మరిన్ని అవకాశాలను ఇస్తోంది.
ప్రైవేట్ సంస్థల నుంచి ఎలాంటి స్పందన కోరుకుంటున్నారు?
కొవిడ్-19తో మనం యుద్ధం చేస్తున్నాం. ఇదే సమయంలో మన స్వదేశీ సాంకేతికతను పరిపుష్టం చేసుకోవటానికి, స్వయం సమృద్ధి సాధించడానికి ఇది ఓ అవకాశం. మా వద్ద ఉన్న సాంకేతికతను అందించటానికి సిద్ధంగా ఉన్నాం. వస్తువులను ఉత్పత్తి చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అని ప్రైవేట్ సంస్థలను అడుగుతున్నా. దీనివల్ల సమాజానికీ ప్రయోజనాలు ఉంటాయి.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో డీఆర్‌డీవోలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
మా సిబ్బందికి ఎలాంటి ప్రమాదం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అంతే కాకుండా అత్యాధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చేశాయి. ఉదాహరణకు ఆరోగ్యసేతు వల్ల అనేక రకాల ఉపయోగాలున్నాయి. ఇలాంటి యాప్‌లనూ ఉపయోగిస్తున్నాం. అంతే కాదు.. రక్షణ దళాలకు అవసరమైన టెక్నాలజీని సమకూరుస్తున్నాం.
స్పెషల్‌డెస్క్