ఇటలీ లాక్‌డౌన్.. గణనీయంగా తగ్గిన కాలుష్యం

ABN , First Publish Date - 2020-03-14T03:50:25+05:30 IST

కోవిడ్-19 కారణంగా చైనా తర్వాత అత్యధిక మరణాలు సంభవిస్తున్నది ఇటలీలోనే...

ఇటలీ లాక్‌డౌన్.. గణనీయంగా తగ్గిన కాలుష్యం

రోమ్: కోవిడ్-19 కారణంగా చైనా తర్వాత అత్యధిక మరణాలు సంభవిస్తున్నది ఇటలీలోనే. ఇక్కడ ఇప్పటి వరకు 1016 మంది చనిపోగా, 15,113 కరోనా వైరస్ నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. అవసరమైతే తప్ప దేశం విడిచి వెళ్లొద్దని పౌరులకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో వైరస్ మరింత విస్తరించకుండా పలు నగరాలను దిగ్బంధించింది. ఆహార దుకాణాలు, ఔషధ షాపులు, నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలు తప్ప మిగతా వాటిని మూసివేసింది.

 

ఇటలీ చేపట్టిన ఈ చర్యల వల్ల ఇప్పుడు ఆ దేశంలో కాలుష్యం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ విడుదల చేసిన చిత్రాల ద్వారా ఈ విషయం తేటతెల్లమైంది. ఉత్తర ఇటలీలో నైట్రోజైన్ డయాక్సైడ్ స్థాయులు గణనీయంగా తగ్గిపోయినట్టు ఆ ఫొటోల ద్వారా తెలుస్తోంది. మూడు వారాల వ్యవధిలో తీసిన ఈ ఫొటోల్లో కాలుష్య స్థాయులు తగ్గడం స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 14, 24, మార్చి 4, 8వ తేదీల్లో సెంటినెల్ 5 ఉపగ్రహం ఈ ఫొటోలు తీసింది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, నాసా రీసెర్చర్ శాంటియాగో గాసో తన ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. 

Updated Date - 2020-03-14T03:50:25+05:30 IST