శశికళ విడుదలపై జైళ్ల శాఖ తాజా ప్రకటన ఇదీ..

ABN , First Publish Date - 2020-12-06T16:32:55+05:30 IST

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు

శశికళ విడుదలపై జైళ్ల శాఖ తాజా ప్రకటన ఇదీ..

చెన్నై : దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదలకు మళ్లీ బ్రేక్‌ పడింది. శశికళ జనవరి 27న మాత్రమే విడుదల అవు తారని కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. అక్రమార్జన కేసులో నాలుగేళ్ల జైలు శిక్షపడి బెంగళూరు పరప్పన అగ్రహం జైలులో ఉన్న శశికళ వచ్చే యేడాది ఫిబ్రవరి 14న విడుదల కావాల్సి వుంది. అయితే సుప్రీం కోర్టు శిక్ష విధించక ముందే శశికళ రెండు సార్లు కొద్ది రోజులపాటు జైలు శిక్ష అనుభవించారు. ఆ రోజులను లెక్కలోకి తీసుకుని కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు శశికళను వచ్చే యేడాది జనవరి 27 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 


అదే సమయంలో శశికళకు సుప్రీం కోర్టు విధిం చిన జరిమానా రూ.10.10 కోట్లను ఇటీవలే ఆమె తరఫు న్యాయవాదులు ప్రత్కేక కోర్టులో చెల్లించారు. ఆ తర్వాత జైలులో సత్ప్రవర్తన, పెరోల్‌ గడువును తక్కువగా ఉపయోగిం చడం, ప్రభుత్వ సెలవుదినాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని శశికళను ముందుగానే విడుదల చేయాలని కోరుతూ ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్‌ పాండ్యన్‌ రెండు సార్లు కర్ణాటక జైళ్ల శాఖ అధికారులకు,  జైలు ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.


ఈ నేపథ్యంలో శశికళ ముందుగానే విడుదలవుతారంటూ ప్రసార మాద్యమాల్లో వెలువడుతున్న వార్తలు వాస్తవమో కాదో స్పష్టం చేయాలంటూ సంఘ సేవకుడు నరసింహమూర్తి సమాచార హక్కు చట్ట ప్రకారం కర్ణాటక జైళ్ల శాఖ అధికారులకు దరఖాస్తు పెట్టారు. దీనిపై స్పందించిన కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు శశికళ గతంలో తాము ప్రకటిం చినట్లు జనవరి 27న విడుదలవుతారని స్పష్టం చేస్తూ బదులిచ్చారు. శశికళ 1997,  2014 సంవత్సరాలలలో 35 రోజులు జైలులో గడిపారని, 17 రోజులు పెరోల్‌ వాడుకున్నారని తెలిపారు. 35 దినాల్లో 17 పెరోల్‌ దినాలు పోగా తక్కిన 18 రోజులను లెక్కలోకి తీసుకుని జనవరి 27న ఆమెను విడుదల చేస్తున్నామని, సత్ప్రవర్తన తదితర అంశాలకు ఆమెకు వర్తించవని జైళ్ల శాఖ అధికారులు ఆర్టీఐ చట్టం ప్రకారం స్పష్టమైన బదులిచ్చారు.

Read more