శశికళ విడుదలకు బ్రేక్..!

ABN , First Publish Date - 2020-10-31T16:23:44+05:30 IST

అపరాధ రుసుము చెల్లింపులో జాప్యం జరుగుతుండడంతో శశికళ విడుదలయ్యేందుకు ఇబ్బందులు ఏర్పడి, మరి కొంతకాలం ఆగాల్సిన పరిస్థితి తలెత్తింది. అక్రమార్జన కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు తలా నాలుగేళ్లు జైలుశిక్ష పొంది 2017 ఫిబ్రవరి 14 నుంచి బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో

శశికళ విడుదలకు బ్రేక్..!

చెన్నై : అపరాధ రుసుము చెల్లింపులో జాప్యం జరుగుతుండడంతో శశికళ విడుదలయ్యేందుకు ఇబ్బందులు ఏర్పడి, మరి కొంతకాలం ఆగాల్సిన పరిస్థితి తలెత్తింది. అక్రమార్జన కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు తలా నాలుగేళ్లు జైలుశిక్ష పొంది 2017 ఫిబ్రవరి 14 నుంచి బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో ఉన్నారు. శశికళకు శిక్షతో పాటు రూ.10 కోట్లు జరిమానా విధించారు. శశికళ శిక్షా కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14తో ముగుస్తుంది. ఆమె ముందుగానే జైలు నుంచి విడుదలయ్యే అవకాశముందని ఆమె తరఫు న్యాయవాదులు తెలిపారు. శశికళ విడుదలకు సంబంధించి సంఘ శ్రేయోభిలాషి నరసింహమూర్తికి కర్ణాటక జైలు శాఖ పంపిన సమాచారం ప్రకారం, జనవరి 27వ తేది శశికళ విడుదలవుతారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సత్ప్రవర్తన నిబంధనల ప్రకారం నాలుగేళ్ల కాలంలో పెరోల్‌ రోజులను మినహాయించి చూస్తే 120 రోజుల ముందుగానే విడుదలయ్యే అవకాశముందని శశికళ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదివరకే జైలు నుంచి శశికళ షాపింగ్‌కు వెళ్లినట్లు ఆరోపణలున్నాయి. 


దీనికి సంబంధించి అప్పటి జైలు శాఖ అధికారి రూప చేపట్టిన విచారణలో, శశికళపై ఆరోపణలు వాస్తవమని తేలింది. ఈ లెక్కన 30రోజులు తగ్గించి నప్పటికీ ముందుగానే ఆమె విడుదలయ్యే అవకాశమున్నట్లు ఆమె తరఫు న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఏ సమయంలోనైనా విడుదల ప్రకటన వెలువడుతుందని వారు ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఆమెకు విధించిన అపరాధరుసుము రూ.10 కోట్లు చెల్లించేందుకు శశికళ వర్గీయులు బెంగుళూరులో మకాం చేశారు.ఈ రుసుముకు ఆదాయపన్ను వివరాలను కూడా సిద్ధం చేశారు. రుసుము చెల్లింపునకు గురువారంలోపు న్యాయస్థానం నుంచి పిలుపువస్తుందని వారు భావించారు. కానీ, దసరా, మిలాదున్‌ నబీ న్యాయస్థానానికి సెలవు కావడంతో, వచ్చే 2వ తేది తరువాత కోర్టు నుంచి పిలుపు వస్తుందని వారు భావిస్తున్నారు. అనుకున్నది జరిగితే మరో వారంలో ఆమె జైలు నుంచి విడుదలయ్యే అవకాశముందని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అపరాధ రుసుము చెల్లించిన వెంటనే ఆ విషయం జైళ్ల శాఖకు చేరి, వెంటనే ఆ రాష్ట్ర హోం శాఖకు తెలియజేస్తారు. కర్ణాటక హోం శాఖ నిర్ణయం అనంతరమే తదుపరి చర్యలు ప్రారంభమవుతాయి. ఈ తతంగమంతా పూర్తయేందుకు సుమారు ఒకట్రెండు నెలలు పట్టవచ్చు. దీంతో శశికళ విడుదల వాయిదా పడే అవకాశముందని జైలు శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - 2020-10-31T16:23:44+05:30 IST