శశికళ ముందస్తు విడుదలకు బ్రేక్‌!

ABN , First Publish Date - 2020-11-21T12:08:14+05:30 IST

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల ప్రయత్నాలకు గండిపడింది. కర్ణాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ప్రకటించినట్లు శశికళ వచ్చే యేడాది జనవరి 27న విడుదలకానున్నారు. అక్రమార్జన కేసులో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం శశికళ బెంగళూరు

శశికళ ముందస్తు విడుదలకు బ్రేక్‌!

చెన్నై : దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల ప్రయత్నాలకు గండిపడింది. కర్ణాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ప్రకటించినట్లు శశికళ వచ్చే యేడాది జనవరి 27న విడుదలకానున్నారు. అక్రమార్జన కేసులో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం శశికళ బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆమె వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కావాల్సి వుంది. అయతే సత్ప్రవర్తన తదితర కారణాల వల్ల ఆమెను జనవరి 27న విడుదల చేస్తామని ఆర్టీఐ చట్టం ప్రకారం కర్ణాటక జైళ్లశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శశికళ నాలుగేళ్ల జైలు శిక్ష కాలంలో ఒక్కసారి మాత్రమే ఆమె భర్త మృతి చెందినప్పుడు పెరోలుపై విడుదలయ్యారని, ఆ తర్వాత పెరోల్‌ కోరలేదని, ప్రభుత్వ సెలవులు కూడా కలుపుకుంటే ఆమె 129 రోజులకు ముందుగా విడుదలయ్యే అవకాశం ఉందని, అపరాధపు సొమ్ము రూ.10.10 కోట్లను కూడా చెల్లించడంతో ఏ క్షణంలోనైనా ఆమె విడుదలవుతారని న్యాయవాది రాజా సెంధూర్‌పాండ్యన్‌ చెబుతూ వచ్చారు. శశికళ ముందస్తు విడుదల కోరుతూ గురువారం ఆయన కర్ణాటక జైళ్ల శాఖ అధికారులకు వినతిపత్రం కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కర్నాటక హోంశాఖ మంత్రి బసవరాజ్‌ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ శశికళ ముందస్తు విడుదల అసాధ్యమని ప్రకటించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం శశికళ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో శశికళ త్వరలో విడుదలవుతారని ఆశలు పెట్టుకున్న అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం నేతలు, కార్యకర్తలు, ఆమె బంధువులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక శశికళ వచ్చే యేడాది జనవరి 27న మాత్రమే విడుదలవుతారని తెలుస్తోంది.

Read more