శశికళతో భేటీకి అనుమతి నిరాకరణ
ABN , First Publish Date - 2020-09-18T16:30:24+05:30 IST
బెంగళూరు పరపన అగ్రహారం జైలులో ఉన్న శశికళను కలుసుకునేందుకు కర్నాటక జైళ్ళ శాఖ అధికారులు అనుమతి నిరాకరించినట్టు ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్ పాండ్యన్ తెలిపారు.

చెన్నై (ఆంధ్రజ్యోతి) : బెంగళూరు పరపన అగ్రహారం జైలులో ఉన్న శశికళను కలుసుకునేందుకు కర్నాటక జైళ్ళ శాఖ అధికారులు అనుమతి నిరాకరించినట్టు ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్ పాండ్యన్ తెలిపారు. అక్రమార్జన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఈ నెలాఖరులోగా విడుదలవుతారని పాండ్యన్ చెబుతుండగా, కర్నాటక జైళ్ళ శాఖ ఉన్నతాధికారులు వచ్చే యేడాది జనవరి 27న ఆమె విడుదలయ్యే అవకాశముందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో శశికళను కలుసుకునేందుకు పాండ్యన్ ఆ రాష్ట్ర జైళ్ల శాఖ అధికారుల అనుమతి కోసం దరఖాస్తు చేయగా దానిని తిరస్కరించారు. ఈ విషయాన్ని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలిపారు. కర్నాటకలో కోవిడ్-19 వైరస్ వ్యాప్తి కారణంగా జైలులో ఉన్న ఖైదీలను ఎవరూ కలుసుకోకుండా కట్టుదిట్టం చేయడం వల్లే తనకు అనుమతి నిరాకరించారని పాండ్యన్ తెలిపారు. జైలులో శశికళ ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో వున్నారో తెలుసుకోవడానికే ఆమెను కలుసుకు నేందుకు తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ఆయన చెప్పారు. శశికళను త్వరగా జైలు నుంచి విడుదల చేయించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నానని, సుప్రీం కోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానా ఏ సమయంలోనైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. జరిమానా చెల్లించిన వెంటనే శశికళను విడుదల చేయించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనకు తెలిసినంతవరకూ శశికళ అక్టోబర్ నెలాఖరు లోగా విడుదలయ్యే అవకాశాలున్నాయని పాండ్యన్ వెల్లడించారు.