జాతీయ సమగ్రతకు పటేల్ నిలువెత్తు నిదర్శనం: కల్‌రాజ్ మిశ్రా

ABN , First Publish Date - 2020-10-31T21:35:12+05:30 IST

భారత దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నవభారత నిర్మాణ రూపకర్త అని..

జాతీయ సమగ్రతకు పటేల్ నిలువెత్తు నిదర్శనం: కల్‌రాజ్ మిశ్రా

జైపూర్: భారత దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నవభారత నిర్మాణ రూపకర్త అని, జాతీయ సమగ్రత విషయంలో ప్రపంచానికే ఆయన ఒక ఉదాహరణగా నిలిచారని రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా అన్నారు. పటేల్ 145వ జయంతి సందర్భంగా ఆయనకు గవర్నర్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యావద్దేశం పటేల్ జయంత్యుత్సవాన్ని రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం)గా జరుపుకొంటోందని అన్నారు. ఆయన నవ భారత నిర్మాణ రూపశిల్పి అని, ఎంతో దూరదృష్టితో, అత్యంత సమర్ధవంతంగా 565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి, ప్రపంచానికే జాతీయ సమగ్రత విషయంలో ఒక ఉదాహరణగా నిలిచారని కొనియాడారు. ఒక వ్యక్తి ఇంత పెద్దఎత్తున అన్ని రాష్ట్రాలను కలిసికట్టుగా ఉండేలా చేయడం ప్రపంచ చరిత్రలోనే లేదని అన్నారు. దేశ సమగ్రతకు, అఖండ్ భారత్ కలల సాకారానికి పటేల్ అందించిన సేవలకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.


 కాగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు శనివారం ఉదయం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

Updated Date - 2020-10-31T21:35:12+05:30 IST