వాళ్లను పదేళ్ల పాటు అండమాన్ పంపండి: సంజయ్ రావత్

ABN , First Publish Date - 2020-10-31T22:00:38+05:30 IST

ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా ఇటీవల ప్రకటన విడుదల చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ చీఫ్ మెహబూబా..

వాళ్లను పదేళ్ల పాటు అండమాన్ పంపండి: సంజయ్ రావత్

ముంబై: ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా ఇటీవల ప్రకటన చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీలపై శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రావత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చైనా ప్రోద్బలంతో భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడే వారందర్నీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ఫరూక్ అబ్దుల్లా కావచ్చు, మెహబూబా ముఫ్తీ కావచ్చు... చైనా సాయం తీసుకుని భారత రాజ్యాంగాన్ని సవాల్ చేసేవారందర్నీ అరెస్ట్ చేసి, 10 ఏళ్ల పాటు అండమాన్ నికోబార్ దీవులకు పంపాలి..’’ అని రావత్ పేర్కొన్నారు. వారంతా ‘‘స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారు..’’ అంటూ పరోక్ష విమర్శలు చేశారు. జమ్మూ కశ్మీర్ నేతలపై సంజయ్ రావత్ ఇలా విరుచుకుపడడం ఇది మొదటిసారి కాదు. కొద్దిరోజులు ముందు కూడా ఇదే అంశంపై మీడియాతో మాట్లుతూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘ముఫ్తీ, అబ్దుల్లా సహా చైనా సాయంతో జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కోరుకుంటున్న నేతలందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలి..’’ అని డిమాండ్ చేశారు. కాగా ఆర్టికల్ 370 పునరుద్ధరణే లక్ష్యంగా ఇటీవల జమ్మూ కశ్మీర్‌కి చెందిన పలువురు నేతలు పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడి) పేరుతో కూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గుప్కార్ డిక్లరేషన్‌‌పై సంతకాలు చేసిన వాటిలో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఎం, పీసీ, జేకేపీఎం, ఏఎన్‌సీ తదితర పార్టీలు ఉన్నాయి. 

Updated Date - 2020-10-31T22:00:38+05:30 IST