మేమూ మీలాగే జవాబిప్తాం: బీజేపీపై సంజయ్ రౌత్ ఫైర్
ABN , First Publish Date - 2020-12-28T21:46:07+05:30 IST
బీజేపీ నేత సోమయ్య విమర్శలను సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. ‘‘వాళ్లు (బీజేపీ) పిల్లల్ని, మహిళల్ని, కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ దిగజారి ప్రవర్తిస్తే మేమూ అదే తరహాలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది’’

ముంబై: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేయడంపై శివసేనపై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మాటల దాడికి దిగింది. పీఎంసీ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి వర్ష రౌత్‌కు ఈడీ మూడుసార్లు నోటీసులు పంపిందని, అయితే వాటికి సంజయ్ రౌత్ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని బీజేపీ సీనియర్ నేత కిరిట్ సోమయ్య ప్రశ్నించారు. సంజయ్ రౌత్‌పై పదునైన ట్వీట్లతో తరుచూ విరుచుకుపడే సోమయ్య.. దర్యాప్తుకు సంబంధించి ఈడీ ప్రశాంతమైన వాతావరణంలో వివరణ కోరితే శివసేన నేత ఎందుకంత ఆగ్రహం చెందుతున్నారని ఎద్దేవా చేశారు.
‘‘శివసేన నేత సంజయ్ రౌత్.. దయచేసి మీరు ఒక స్పష్టత ఇవ్వండి. మీ భార్య వర్షకు పీఎంసీ బ్యాంక్ దర్యాప్తుకు సంబంధించి హెచ్‌డీఐఎల్ ఫండ్స్‌కు సంబంధించి నవంబర్ 4వ వారంలో డిసెంబర్ 2వ వారంలో, డిసెంబర్ 4వ వారంలో మూడు సమన్లు (నోటీసులు) పంపించింది. దీనిపై ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో స్పందించేందుకు సంజయ్ రౌత్ ఎందుకు నిరాకరించారు? ఎందుకు ఆయన కుటుంబ సభ్యులు హెచ్‌డీఐఎల్ ద్వారా పీఎంసీ బ్యాంకు డబ్బు తీసుకున్నారు? సంజయ్ రౌత్‌కు హెచ్‌డీఐఎల్‌తో ప్రవీణ్ రౌత్‌తో ఉన్న సంబంధం ఏమిటి?’’ అని సోమయ్య వరుస ట్వీట్లు చేశారు.
బీజేపీ నేత సోమయ్య విమర్శలను సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. ‘‘వాళ్లు (బీజేపీ) పిల్లల్ని, మహిళల్ని, కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ దిగజారి ప్రవర్తిస్తే మేమూ అదే తరహాలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది’’ అని ఘాటుగా స్పందించారు. ‘‘వాస్తవానికి ఎలాంటి పొరపాటూ జరగలేదు. హెచ్‌డీఐఎల్, పీఎంసీ గురించి బీజేపీ నేతలు ఏవేవో లెక్కలు చెబుతున్నారు. వాళ్లకి ఈ సమాచారం ఎక్కడిది? మూడు నెలలుగా బీజేపీ నేతలు ఈడీ కార్యాలయానికి తిరగడం మేము గమనిస్తూనే ఉన్నాం. మా ప్రభుత్వాన్ని ఎవరూ కదల్చలేరు. ఈడీకి తొందరలోనే సమాధానం చెప్తాం’’ అని సంజయ్ రౌత్ అన్నారు.