నూతన పార్లమెంటు భవనం విశేషాలు

ABN , First Publish Date - 2020-12-06T21:28:01+05:30 IST

భారతీయుల కలల సాకారానికి గుర్తుగా నిలిచే నూతన పార్లమెంటు భవనానికి ప్రధాన మంత్రి

నూతన పార్లమెంటు భవనం విశేషాలు

న్యూఢిల్లీ : భారతీయుల కలల సాకారానికి గుర్తుగా నిలిచే నూతన పార్లమెంటు భవనానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న శంకుస్థాపన చేయబోతున్నారు. 93 ఏళ్ళనాటి ప్రస్తుత పార్లమెంటు భవనానికి బదులుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. స్వతంత్ర భారతావని 75 వసంతాలు పూర్తి చేసుకున్నప్పటి నుంచి ఈ నూతన భవనంలో పార్లమెంటు ఉభయ సభల సమావేశాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలు భౌతికంగా కానీ, వర్చువల్ పద్ధతిలో కానీ హాజరవుతారు. ఈ నూతన భవనం విశేషాలు ఏమిటంటే...


- టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మిస్తుంది. 


- దీనికి హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూపకల్పన చేసింది.


- 2020 డిసెంబరు 10న మధ్యాహ్నం 1 గంటకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారు.


- నూతన పార్లమెంటు భవనం నిర్మాణం 2022నాటికి పూర్తవుతుందని ఆశిస్తున్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022తో 75 సంవత్సరాలు పూర్తవుతాయన్న సంగతి తెలిసిందే.


- దీని కోసం రూ.971 కోట్లు ఖర్చవుతుందని అంచనా.


- ఈ భవనానికి ఆరు ప్రవేశ మార్గాలు ఉంటాయి. 1. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి; 2. లోక్‌సభ సభాపతి, రాజ్యసభ చైర్‌పర్సన్, ఎంపీలు; 3. సాధారణ ప్రవేశ మార్గం, 4. ఎంపీల కోసం మరొక ప్రవేశ మార్గం, 5,6. పబ్లిక్ ఎంట్రన్స్‌లు.


- ఈ భవనాన్ని నాలుగు అంతస్థులతో నిర్మిస్తారు. లోయర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్, మొదటి, రెండో అంతస్థులు ఉంటాయి. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తారు. 


- లోక్‌సభ ఛాంబర్‌లో 888 సీట్లు ఉంటాయి. దీని మొత్తం వైశాల్యం 3,015 చదరపు మీటర్లు.


- రాజ్యసభ చాంబర్లో 384 సీట్లు ఉంటాయి.  దీని వైశాల్యం 3,220 చదరపు మీటర్లు.


- భూకంపాలను తట్టుకునే విధంగా ఈ నూతన భవనాన్ని నిర్మిస్తారు. 


- ఈ నూతన భవనంలో 120 కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. కమిటీ సమావేశ మందిరాలు, పార్లమెంటరీ వ్యవహారాల ప్రధాన కార్యాలయాలు, లోక్‌సభ సచివాలయం, రాజ్యసభ సచివాలయం, ప్రధాన మంత్రి కార్యాలయం, కొందరు ఎంపీల కార్యాలయాలు, సిబ్బంది, భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక గదులు వంటివి ఉంటాయి. 


- ఫర్నిచర్‌లోనే స్మార్ట్ డిస్‌ప్లేస్ సదుపాయాలు ఉంటాయి. ఒక భాష నుంచి మరొక భాషకు అనువదిండానికి డిజిటల్ సదుపాయాలు ఉంటాయి. ప్రోగ్రామబుల్ మైక్రోపోన్స్, రికార్డింగ్ సదుపాయాలు ఉంటాయి. సులువుగా ఓటు వేయడానికి వీలుగా బయోమెట్రిక్స్ ఉంటాయి. 


- మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, దేశీయ వాస్తు రీతుల్లో దీనిని నిర్మిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాస్తు రీతులు దీనిలో చూడవచ్చు. సాంస్కృతిక వైవిద్ధ్యం కూడా కనిపిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులు ఈ నిర్మాణంలో పాలుపంచుకుంటారు. 


- ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని పురావస్తు సంపదగా పరిరక్షిస్తారు. 



Updated Date - 2020-12-06T21:28:01+05:30 IST