కోవిడ్-19 పై పోరాటానికి సచిన్ భారీ విరాళం
ABN , First Publish Date - 2020-03-27T20:22:55+05:30 IST
ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేపుతున్న కోవిడ్ 19పై పోరాటానికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం..
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేపుతున్న కోవిడ్ 19పై పోరాటానికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం ముందుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తనవంతుగా రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. భారత క్రీడా దిగ్గజాల్లో అత్యధిక విరాళం సచిన్ టెండూల్కర్ నుంచే రావడం గమనార్హం. ఇప్పటి వరకు పలువురు క్రీడా ప్రముఖులు తమ జీతాలను విరాళంగా ప్రకటించగా... మరికొందరు కరోనాపై పోరాటం కోసం వైద్య పరికరాలను పంపి దాతృత్వం చాటుకున్నారు. కాగా సచిన్ తన విరాళంలో ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు, ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు పంపినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సచిన్ టెండూల్కర్... సాధారణంగా తాను చేసిన సాయాన్ని బయటికి చెప్పేందుకు ఇష్టపడరు. కాగా కోవిడ్-19 సాయం కోసం విరాళాలు ఇచ్చిన క్రికెటర్లలో పటాన్ సోదరులు, ధోనీ కూడా ఉన్నారు. పటాన్ సోదరులు బరోడా పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బందికి 40 వేల మాస్కులను సమకూర్చగా.. పూణే కేంద్రంగా పనిచేసే ఓ ఎన్జీవో సంస్థ ద్వారా ధోని రూ. లక్ష విరాళం ఇచ్చాడు. కాగా రెజ్లర్ భజరంగ్ పూనియా, స్ప్రింటర్ హిమదాస్ తదితరులు కూడా తమ జీతాలను విరాళంగా ప్రకటించారు.