రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచిన సచిన్ పైలట్

ABN , First Publish Date - 2020-09-12T20:58:57+05:30 IST

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆ పార్టీకి చెందిన రాజస్థాన్ యువ నేత సచిన్ పైలట్ మద్దతుగా నిలిచారు.

రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచిన సచిన్ పైలట్

జైపూర్ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆ పార్టీకి చెందిన రాజస్థాన్ యువ నేత సచిన్ పైలట్ మద్దతుగా నిలిచారు. దేశంలో నిరుద్యోగం పెరిపోతుండటం, ఆర్థిక వ్యవస్థ క్షీణించడం వంటి విషయాలపై మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలు సరైనవేనని చెప్పారు. 


సచిన్ పైలట్ జైపూర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలు న్యాయమైనవేనని అన్నారు. మన దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. జీతాల్లో కోతలు విధిస్తున్నారని చెప్పారు. మరోవైపు చైనా మన భూభాగంలోకి ప్రవేశిస్తోందని చెప్పారు. 


భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఇతర అంశాల గురించి మాట్లాడుతున్నారని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా యావత్తు దేశం మద్దతిస్తుందన్నారు. 


రాహుల్ గాంధీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘కోవిడ్-19పై మంచి ప్రణాళికాబద్ధమైన పోరు భారత దేశాన్ని అగాధంలోకి నెట్టింది. 24 శాతం చారిత్రక జీడీపీ క్షీణత, 12 కోట్ల ఉద్యోగాల నష్టం, రూ.15.5 లక్షల కోట్ల అదనపు స్ట్రెస్డ్ లోన్స్, ప్రపంచంలో అత్యధిక రోజువారీ కోవిడ్-19 కేసులు, మరణాలు. కానీ భారత ప్రభుత్వానికి, మీడియాకు అంతా బాగుంది’’ అని పేర్కొన్నారు. 


అమిత్ షా గురువారం మాట్లాడుతూ, ‘‘కరోనా వైరస్ మనకు మునుపెన్నడూ లేనటువంటి సవాలు. కానీ మనం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మంచి ప్రణాళికాబద్ధంగా దీనిపై పోరాడుతున్నాం. మన కృషిని యావత్తు ప్రపంచం గుర్తించింది’’ అని చెప్పారు. 


ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో ‘‘కోవిడ్-19పై మంచి ప్రణాళికాబద్ధమైన పోరు’’ అంటూ వ్యంగ్యంగా మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 


Updated Date - 2020-09-12T20:58:57+05:30 IST