ఉన్న ఫళంగా లాక్‌డౌన్‌తోనే కార్మికులకు సమస్యలు : సచిన్ పైలెట్

ABN , First Publish Date - 2020-05-29T17:46:09+05:30 IST

వలస కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ ఆరోపించారు.

ఉన్న ఫళంగా లాక్‌డౌన్‌తోనే కార్మికులకు సమస్యలు : సచిన్ పైలెట్

న్యూఢిల్లీ : వలస కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ ఆరోపించారు. కేంద్రం ఉన్నఫళంగా లాక్‌డౌన్ విధించడంతోనే కార్మికులు ఆకలి దప్పులతో స్వస్థలాలకు చేరుకుంటున్నారని అన్నారు. కరోనా సవాల్‌ను ఎదుర్కోడానికి, తగిన వనరులను పెంచుకోడానికి లాక్‌డౌన్ పెట్టారని, అయినా సరే ఆ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.


ఇన్ని రోజులు గడచినా, ఆస్పత్రులు, వైద్యులు, వెంటిలేటర్లను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. వలస కార్మికుల విషయం కేంద్రానికి ఓ గుణపాఠం లాంటిందని, దానిని సరిగ్గా హ్యాండిల్ చేయలేదన్నారు. ‘‘నాయకత్వం అంటేనే ముందు చూపుతో ఆలోచించడం. వలసల విషయంలో కేంద్రం విఫలమైంది. నిజంగా మనసు పెట్టి కేంద్రం గనుక ఆలోచిస్తే ఓ సమస్యను కేంద్రం కనుగొనేది. దేశంలో పాన్ - ఇండియా లేబర్ మైగ్రెంట్ పేమెంట్ పాలసీ లేదు. అందుకే నాయకత్వంలో ఓ గందరగోళం నెలకొంది’’ అని పేర్కొన్నారు.


బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు కేంద్రం తగిన సహాయం చేయడం లేదని, ప్రతీకారం తీర్చుకునే తరహాలో కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు రెండూ కోవిడ్‌తో పోరాడుతున్నాయని, కానీ బీజేపీయేతర రాష్ట్రాల నుంచే ఎక్కువగా నెగెటివ్ వచ్చేలా చేస్తున్నారన్నారు.


లాక్‌డౌన్ విధిస్తున్న సందర్భంలో కేంద్రం రాష్ట్రాలతో కనీసం సంప్రదింపులు కూడా జరపలేదని, ఇప్పటికీ సంప్రదింపుల్లో కొంత సందిగ్ధత ఉందని ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్ ఎత్తేసే విషయంలో మాత్రం కేంద్రం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని సచిన్ పైలెట్ సూచించారు. 

Updated Date - 2020-05-29T17:46:09+05:30 IST