తెరుచుకోనున్న శబరిమల ఆలయం

ABN , First Publish Date - 2020-06-06T21:47:56+05:30 IST

నెలవారీ పూజలు, ఫెస్టివల్ కోసం కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయం ఈనెల 14 నుంచి తిరిగి తెరుచుకోనుంది. మలయాళం మిధున ..

తెరుచుకోనున్న శబరిమల ఆలయం

తిరువనంతపురం: నెలవారీ పూజలు, ఫెస్టివల్ కోసం కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయం ఈనెల 14 నుంచి తిరిగి తెరుచుకోనుంది. మలయాళ మిధున మాసంలో ఐదు రోజుల నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తెరుస్తున్నారు. జూన్ 19 నుంచి 28 వరకూ శబరిమల ఫెస్టివల్ కోసం వర్చువల్ క్యూ సిస్టం అమలు చేస్తున్నట్టు దేవసోమ్ మంత్రి కడంకంపల్లి సరేంద్రన్ తెలిపారు. గంటలో 200 మందిని పేర్లు రిజిస్టర్ చేసుకునేందుకు అనుమతిస్తామని చెప్పారు.


ఆలయంలో రద్దీని నియంత్రించేందుకు వీలుగా 50 మంది భక్తులనే ఆలయం ముందు ఉండేందుకు అనుమతిస్తారు. ఆలయ ఆవరణలోకి ప్రవేశించే ముందు భక్తులకు స్కానింగ్ పంప, సన్నిధానం వద్ద చేస్తారు. ముందుజాగ్రత్త  చర్యగా మాస్క్‌లు, శానిటైజర్లు తెచ్చుకోవాలని కూడా దేవస్థానం అధికారులు సూచనలు చేస్తున్నారు.


కాగా, శబరిమలలో భక్తులెవరికీ బస సౌకర్యం ఉండదు. రెండు విడతలుగా ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, మళ్లీ మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఆలయ వేళలు నిర్దేశించారు. పంప వరకూ మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తప్పని సరిగా ప్రభుత్వ కోవిడ్ జాగ్రత్త పాస్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయించుకోవాలి. అప్పం, అరవణ కోసం ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇతర రాష్ట్రాల భక్తులు తమకు కోవిడ్‌ లేదని తెలియజేసే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ల్యాబ్ సర్టిఫికేట్‌ను ప్రూఫ్‌గా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

Updated Date - 2020-06-06T21:47:56+05:30 IST