ఏడాది చివర్లో బీజేపీపై మరింత ఘాటుగా స్పందించిన శివసేన

ABN , First Publish Date - 2020-12-27T19:44:42+05:30 IST

ప్రభుత్వాన్ని నడపడానికి డబ్బు ఉండదు. కానీ ఎన్నికల్లో పాల్గొనడానికి ప్రభుత్వాలను కూల్చడానికి మాత్రం చాలా డబ్బు ఉంటుంది. దేశం చాలా అప్పుల్లోకి వెళ్తోంది. ఇలాంటి సమయంలో ప్రధానమంత్రి ప్రశాంతంగా

ఏడాది చివర్లో బీజేపీపై మరింత ఘాటుగా స్పందించిన శివసేన

ముంబై: భారతీయ జనతా పార్టీ, ప్రధాని మోదీపై శివసేన తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మొత్తంగా 2020లో జరిగిన సంఘటనలను మొత్తంగా ప్రస్తావిస్తూ ప్రధానిపై పదునైన వ్యాఖ్యలు చేసింది. లద్ధాఖ్ సరిహద్దులోకి చైనా సైనికులలు చొచ్చుకు రావడంతో దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొందని ఆ సమయంలో చైనా వస్తువులను బహిష్కరించాలంటూ నినాదాలు చెలరేగిన విషయాన్ని గుర్తు చేస్తూ.. సరిహద్దులో మోహరించిన చైనా సైనికుల్ని వెనక్కి పంపించకుండా చైనా పెట్టుబడుల్ని దేశం నుంచి తరలిస్తున్నారని మోదీ ప్రభుత్వంపై శివసేన అధికారిక పత్రిక సామ్నాలో మండిపడ్డారు. ఇక లాక్‌డౌన్ సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారని, ఆర్థిక వ్యవస్థ చాలా క్షీణించిందని ఇలాంటి సమయంలో కొత్త పార్లమెంట్ భవనం కట్టాలనే ఆలోచన మోదీకి రావడం ఆశ్చర్యకరమని ఎద్దేవా చేశారు.


‘‘సరిహద్దులోకి చొచ్చుకొచ్చిన చైనా సైనికుల్ని వెనక్కి పంపించాలి. కానీ దానికి బదుల చైనా పెట్టుబడుల్ని దేశం నుంచి వెనక్కి పంపిస్తున్నారు. పూణె సరిహద్దులో ఒక జనర్ మోటర్స్‌కు చెందిన ఫ్యాక్టరీ మూతపడింది. దీని వల్ల 1,800 మంది తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు. చైనాకు చెందిన మరో సంస్థ 5 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కిపోతున్నాయి. లాక్‌డౌన్‌తో ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థితిలో ఉంది. ఈ సమయంలో ఇలాంటి నిర్ణయాలు దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయి?’’ అని సామ్నా సంపాదకీయం ప్రశ్నించింది.


‘‘కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇండియాతో పాటు ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మన దేశ ప్రజల బ్యాంకు ఖాతాల్లో 85 వేల కోట్ల రూపాయలు వేస్తామని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. బ్రెజిల్, బ్రిటన్ కూడా ఇలాంటి ప్రకటనలు చేశాయి. అయితే భారతీయుల జేబులు ఖాళీగానే ఉన్నాయి. 2020 ఏమైనా జరుగుండొచ్చు, కానీ ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. మోదీ కట్టబోతున్న కొత్త పార్లమెంట్ భవనం ప్రజాస్వాన్ని బలపర్చదు. దేశం ఆర్థిక కష్టాల్లో ఉంటే వేల కోట్లతో కొత్తగా పార్లమెంట్‌ కట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ప్రజల నుంచి లక్ష చందా కూడా వసూలు చేయలేరు. ఎందుకంటే ఇది వ్యర్థమైన పనని ప్రజలకు తెలుసు’’ అని సామ్నా విమర్శించింది.


ఇక ప్రధానమంత్రి మోదీపై మరింత ఘాటుగా సామ్నాలో రాసుకొచ్చారు. ‘‘ప్రభుత్వాన్ని నడపడానికి డబ్బు ఉండదు. కానీ ఎన్నికల్లో పాల్గొనడానికి ప్రభుత్వాలను కూల్చడానికి మాత్రం చాలా డబ్బు ఉంటుంది. దేశం చాలా అప్పుల్లోకి వెళ్తోంది. ఇలాంటి సమయంలో ప్రధానమంత్రి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లయితే దానికి తప్పనిసరిగా ప్రశంసలు కురిపించాలి. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కూల్చడంలో మోదీ కీలకపాత్ర వహించారట. బీజేపీ ఎంపీ కైలాష్ విజయవర్గీయ దీనిని చాలా గొప్పగా చెప్పారు. బీజేపీయేతర ప్రభుత్వాన్ని కూల్చి తమ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసే పనిలో మోదీ బిజీగా ఉన్నట్లయితే మనం అంతకు మించి ఇంకేం మాట్లాడగలం’’ అని సామ్నా విమర్శలు గుప్పించింది.

Updated Date - 2020-12-27T19:44:42+05:30 IST