చేతి వృత్తులతో సాధికారులైన రాజస్థాన్ గ్రామీణ మహిళలు
ABN , First Publish Date - 2020-04-25T23:28:21+05:30 IST
రాజస్థాన్ గ్రామీణ మహిళలు చేతి వృత్తులతో సాధికారులై అందరికీ ఆదర్శంగా

న్యూఢిల్లీ : రాజస్థాన్ గ్రామీణ మహిళలు చేతి వృత్తులతో సాధికారులై అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్ తహశీల్‌లో మహిళలు చేతి వృత్తులతో ఆర్థిక స్వావలంబన సాధించారు. మహిళా సాధికారతలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు.
జైసల్మేర్ ప్రాంతం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి ఈ మహిళల కృషి అధికంగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. స్థానిక చేతి వృత్తులనే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని, వీరు ఆర్థిక స్వావలంబన సాధించారు. దీంతో ఆర్థిక వ్యవస్థ బలపడటంతోపాటు, ఈ ప్రాంతానికి కొత్త గుర్తింపు వచ్చింది.
ఓ స్వచ్ఛంద సంస్థ 2019 నవంబరు, డిసెంబరు, 2020 జనవరి నెలల్లో ఛాఛా, థాట్, గోమట్ గ్రామాలకు చెందిన 106 మంది మహిళలకు చేతి వృత్తుల శిక్షణ ఇచ్చింది. వీరికి ఆర్థికంగా ఓ బ్యాంకు సహకరించింది. చేనేత, ఖాదీ, కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వంటివాటిలో వీరు శిక్షణ పొందారు.
ఇప్పటి వరకు గ్రామీణ మహిళలు తమ సంప్రదాయ చేతి వృత్తులను నేర్చుకోవడానికి ఇష్టపడేవారు కాదు. తాజాగా వీరు వాటిని నేర్చుకుని, ఇంటివద్దే స్వయం ఉపాధి పొందుతున్నారు. తమ కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడటంతోపాటు జీవనోపాధి పొందుతున్నారు.
పోఖ్రాన్‌లోని సంప్రదాయ చేనేతలకు ప్రపంచ మార్కెట్‌లో స్థానం లభించడంతో ఇక్కడి మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.