సొంత గూటికి తిరిగొచ్చిన ఎమ్మెల్యే... కాంగ్రెస్‌లో చేరి తప్పుచేశానంటూ...!

ABN , First Publish Date - 2020-12-02T02:45:11+05:30 IST

గతేడాది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన రూపనగర్ శాసనసభ్యుడు అమర్జిత్ సింగ్ సాండోవా మళ్లీ తిరిగి సొంతగూటికి చేరుకున్నారు...

సొంత గూటికి తిరిగొచ్చిన ఎమ్మెల్యే... కాంగ్రెస్‌లో చేరి తప్పుచేశానంటూ...!

చండీగఢ్: గతేడాది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన రూపనగర్ శాసనసభ్యుడు అమర్జిత్ సింగ్ సాండోవా మళ్లీ తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. పంజాబ్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీలో ఏడాదిన్నర పాటు కొనసాగిన ఆయన ఇవాళి తిరిగి ఆప్ చెంతకు చేరుకున్నట్టు ఆ పార్టీ ఇవాళ ఓ ప్రకటనలో పేర్కొంది. పంజాబ్ పట్ల ఆప్ అధిష్టానం ‘‘అణచివేత’’ ధోరణి కారణంగా నిరాశ చెందిన కారణంగానే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ గతేడాది సాండోవా పేర్కొన్నారు. కాగా మంగళవారం ఆయన ఆప్‌కి తిరిగివచ్చిన సందర్భంగా ఆయనను ఉటంకిస్తూ ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆప్‌ను వీడాలన్న నా నిర్ణయం కారణంగా కలతచెందిన పార్టీ అధిష్టానాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని నేను క్షమాపణ కోరాను. పార్టీలో ఎలాంటి పదవులూ ఆశించకుండా స్వచ్ఛందంగా పార్టీ కోసం పనిచేయాలని నిర్ణయించు కున్నాను...’’ అని ఆయన పేర్కొన్నట్టు ఆప్ తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ తాను తీసుకున్న నిర్ణయం తాను చేసిన ‘‘అతిపెద్ద పొరపాటు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద పొరపాటు. తొందరపడి ఆ నిర్ణయం తీసుకున్నందుకు నేను ఇప్పుడు సిగ్గుపడుతున్నాను...’’ అని సాండోవా పేర్కొన్నారు. పంజాబ్ ప్రజల కోసం ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేసిందేమీ లేదనీ.. ఆయన ‘‘ప్రజా వ్యతిరేక నిర్ణయాల’’ కారణంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చూపిస్తున్న దార్శనికత, సరికొత్త రాజకీయ ఒరవడి.. తాను తిరిగి పార్టీలో చేరేలా స్ఫర్తినిచ్చాయని సదరు ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-02T02:45:11+05:30 IST