నితీష్ సభలో ఉండటంపై గలభా

ABN , First Publish Date - 2020-11-25T21:26:17+05:30 IST

బీహార్ అసెంబ్లీలో బుధవారంనాడు స్పీకర్ ఎంపిక సమయంలో గలభా చేటుచేసుకుంది. సభలో ..

నితీష్ సభలో ఉండటంపై గలభా

పాట్నా: బీహార్ అసెంబ్లీలో బుధవారంనాడు స్పీకర్ ఎంపిక సమయంలో గలభా చేటుచేసుకుంది. సభలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉండటంపై విపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆయన లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడని, ఎమ్మెల్యే కాదంటూ విపక్ష నేతలు అభ్యంతరం చెప్పారు. రూల్ బుక్‌ను ప్రోటెం స్పీకర్ జితిన్ రామ్ మాంఝీకి ఆర్జేడీ ఎమ్మెల్యేలు చూపించారు. ప్రజాస్వామ్యాన్ని ఎన్డీయే ఖూనీ చేస్తోందంటూ సభలో విపక్ష నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. మొదట ఎన్నికల ఫలితాలను దొంగిలించిందని, ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా అదే విధంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఎమ్మెల్యేలు కాని వారు సభలో ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు. మాంఝీ స్పందిస్తూ, వేరే సభ నుంచి వచ్చిన వారు స్పీకర్ ఎన్నికకు ఓటు వేయరని, వారు ఉండటం వల్ల సష్టమేమీ ఉండదని అన్నారు. సీఎం నితీష్ కుమార్ హాజరుపై విపక్ష నేతలు నినాదాలు చేస్తూ పోడియం దగ్గర నిరసన ప్రదర్శనకు దిగారు. దీంతో సభకు కొంతసేపు అంతరాయం కలిగింది.


కాగా, సభలో చోటుచేసుకున్న గందరగోళంపై మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఆ తరువాత ఒక ప్రకటన చేస్తూ, సభా సంప్రదాయం ప్రకారం, ఓటింగ్ సమయంలో ఇతర సభల వ్యక్తులు కూడా హాజరవుతుంటారని, దీనిపై విపక్షాలు నిలదీయడంలో అర్ధం లేదని అన్నారు.

Updated Date - 2020-11-25T21:26:17+05:30 IST