కరోనా... సెల్ఫ్ ఐసోలేషన్... నిబంధనలు ఉల్లంఘిస్తే... రూ. 9.5 లక్షల జరిమానా...
ABN , First Publish Date - 2020-09-20T22:23:26+05:30 IST
కరోనా మహమ్మది నేపధ్యంలో సెల్ఫ్ ఐసోలేషన్ నిబంధనలు పాటించనిపక్షంలో... 10 వేల పౌండ్లు(భారతీయ కరెన్సీలో సుమారు రూ. 9.5 లక్షలు) జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

లండన్ : కరోనా మహమ్మది నేపధ్యంలో సెల్ఫ్ ఐసోలేషన్ నిబంధనలు పాటించనిపక్షంలో... 10 వేల పౌండ్లు(భారతీయ కరెన్సీలో సుమారు రూ. 9.5 లక్షలు) జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
సంబంధిత టెస్టుల్లో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, లేదంటే కరోనావైరస్ సోకినవారితో సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించినా... వారు సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అలా చేయనివారికి... ఈ నెల( సెప్టెంబరు) 28 వ తేదీ నుంచి భారీ జరిమానాలను విధించనున్నారు.
కరోనా కేసులు ఇటీవలి కాలంలో మళ్లీ పెరుగుతూండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా... శనివారం ఒక్కరోజే ఇంగ్లండ్‌లో కొత్తగా 4,422 పాజిటివ్ కేసులు, 27 మరణాలు నమోదయ్యాయి. స్కాట్లాండ్లో 350, వేల్స్లో 212, నార్తర్న్ ఐర్లాండ్‌లో 222 కేసులు నమోదయ్యాయి.
ఇక... జరిమానాలు వెయ్యి నుంచి 10 వేల పౌండ్ల వరకు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే... కరోనాతో పోరాటంలో నిబంధనలను ఖచ్చితంగా పాటించడమే సరైన మార్గమని ప్రధాని బోరిస్ జాన్సన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
'నిబంధనలు పాటించడం చాలా అవసరం. కరోనా పాజిటివ్‌గా తేలితే నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే. లేదంటే జరిమానాలు చెల్లించాలి' అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు కరోనావైరస్ నిబంధనలు పాటించకపోవడంతో ఇంగ్లండ్, వేల్స్‌లలో 19 వేల మందికి పైగా జరిమానాలు విధించారని అటార్నీ జనరల్ వెల్లడించారు. అయితే... ఆ జరిమానాలను ఇందులో సగం మంది కూడా ఇంకా చెల్లించలేదని తెలిపారు.
ఏమిటీ కొత్త నిబంధనలు...
సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా ‘నేషనల్ హెల్త్ సర్వీస్’ సూచించిన తరువాత వారు అలా ఉండకపోతే... వెయ్యి పౌండ్ల(రూ. 95 వేలు) నుంచి గరిష్ఠంగా 10 వేల పౌండ్ల(రూ. 9.5 లక్షలు) వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
సెల్ఫ్ ఐసోలేషన్ నిబంధనలను పట్టించుకోకుండా విధులకు రమ్మని చెప్పే యజమానులు కూడా దీని పరిధిలోకి వస్తారు. ఈ నెల(సెప్టెంబరు) 28 నుంచి తాజా నిబంధనలుఅమలు కానున్నాయి. కొత్త నిబంధనల అమలును స్థానిక అధికారులు, పోలీసులు పర్యవేక్షిస్తారు.
కాగా... అల్పాదాయవర్గాలు, వర్క్ ఫ్రం హోం చేయడానికి వీలులేని వారు సెల్ఫ్ ఐసోలేషన్ కాలంలో 500 పౌండ్లను(సుమారు రూ. 47,500) ప్రభుత్వం నుంచి సహాయం పొందుతారు.