77సార్లు ట్రాఫిక్ ఉల్లంఘించినందుకు రూ.42 వేలు జరిమానా
ABN , First Publish Date - 2020-10-31T21:27:21+05:30 IST
ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై కర్ణాటక పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

బెంగళూరు : ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై కర్ణాటక పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన సంఘటనలను జాబితాగా రూపొందించి, ఒకేసారి జరిమానా విధిస్తున్నారు. ఉల్లంఘనల జాబితా పొడవు మీటర్ల కొద్దీ ఉంటోంది. ఈ జరిమానాలను చెల్లించడానికి సమయం కోరితే, వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.
బెంగళూరులోని మడివల ప్రాంతవాసి అరుణ్ కుమార్ అనే కూరగాయల వ్యాపారి 77సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఆయనకు రూ.42,500 జరిమానా విధించారు. ఎప్పుడెప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినదీ వివరించే బిల్లును చేతిలో పెట్టారు. దీని పొడవు సుమారు 2 మీటర్లు ఉంటుంది. ఈ జరిమానా చెల్లించేందుకు తనకు కాస్త సమయం ఇవ్వాలని అరుణ్ కుమార్ కోరితే, ఆయన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మంజునాథ్ అనే మరొక కూరగాయల వ్యాపారి కూడా రూ.15,400 జరిమానా చెల్లించవలసి వచ్చింది. ఆయన 70సార్లు హెల్మెట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నూతన ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి భారీ జరిమానాలు విధిస్తున్న కేసులు చాలా కనిపిస్తున్నాయి.