నూతన వ్యవసాయ చట్టాల చెల్లుబాటుపై సుప్రీంకోర్టుకు ఆర్జేడీ నేత
ABN , First Publish Date - 2020-10-03T22:21:50+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రాజ్యాంగ
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత, ఎంపీ మనోజ్ ఝా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టాలు వివక్షాపూరితంగా, నియంతృత్వంగా ఉన్నాయని, సామాన్య రైతులను పెద్ద కార్పొరేట్ కంపెనీలు దోపిడీ చేసేందుకు అవకాశం ఇస్తాయని ఆరోపించారు.
రైతుల (సాధికారత, పరిరక్షణ) ధర హామీ ఒప్పందం, వ్యవసాయ సేవల చట్టం, 2020; రైతుల ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార ప్రోత్సాహక, సదుపాయాల కల్పన చట్టం, 2020; నిత్యావసర వస్తువుల సవరణ చట్టం, 2020లకు పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ చట్టాలు సెప్టెంబరు 27 నుంచి అమల్లోకి వచ్చాయి.
మనోజ్ ఝా తన పిటిషన్‌లో ఈ చట్టాలు వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు దోహదపడతాయని ఆరోపించారు. క్రమరహితమైన, దోపిడీ చేసే వ్యవస్థకు బాటలు పరుస్తాయని పేర్కొన్నారు. ప్రైవేటు కంపెనీతో చర్చలు జరిపి, ఉత్తమమైన ఒప్పందాన్ని కుదుర్చుకునే పరిజ్ఞానం రైతులకు ఉండదన్నారు. కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయ రంగంలో గుత్తాధిపత్యం సాధిస్తాయన్నారు.
పార్లమెంటరీ నిబంధనలు, సంప్రదాయాలకు విరుద్ధంగా ఈ చట్టాలను ఆమోదించారని ఆరోపించారు. ఈ చట్టాలు వివక్షాపూరితమైనవి, నియంతృత్వంతో కూడినవి కాబట్టి రాజ్యాంగ విరుద్ధమైనవని తెలిపారు. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఈ చట్టాలు ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపించారు.
భారత దేశంలో నిరుపేద రైతులకు వ్యవసాయమే జీవనాధారమని తెలిపారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడాన్ని ఈ చట్టాలు ప్రోత్సహిస్తున్నాయని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను ఈ చట్టాలు పట్టించుకోలేదన్నారు. స్పాన్సర్ల దయాదాక్షిణ్యాలకు రైతులను వదిలిపెడుతున్నాయని, వివాదాల పరిష్కారానికి తగిన యంత్రాంగాన్ని సూచించలేదని తెలిపారు.