ముందుంది ముప్పు!

ABN , First Publish Date - 2020-05-08T07:15:08+05:30 IST

‘‘దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపయ్యే వేగం తగ్గింది! అమెరికా, యూరప్‌ దేశాలతో పోలిస్తే మన దగ్గర కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. పరీక్షలు చేయించుకున్న ప్రతి 10 లక్షల మందిలో వైరస్‌ బారిన పడుతున్నవారి...

ముందుంది ముప్పు!

  • వేగంగా పెరుగుతున్న కేసులు
  • యూరప్‌లో లాక్‌డౌన్‌ ఫలితాలు 21 రోజులకు!
  • ఇక్కడ 45 రోజుల తర్వాతా కేసుల పెరుగుదల
  • భారత్‌లో పతాకస్థాయికి చేరని వైరస్‌ వ్యాప్తి
  • దేశ జనాభాలో వైరస్‌ సోకినవారు 0.03శాతం!
  • జూన్‌-జూలై నాటికి గరిష్ఠానికి కేసుల సంఖ్య
  • లాక్‌డౌన్‌ను పొడిగించాలి: ఎయిమ్స్‌ డైరెక్టర్‌

‘‘దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపయ్యే వేగం తగ్గింది! అమెరికా, యూరప్‌ దేశాలతో పోలిస్తే మన దగ్గర కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. పరీక్షలు చేయించుకున్న ప్రతి 10 లక్షల మందిలో వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య మనదగ్గరే తక్కువ’’.. కేంద్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు తరచుగా చెప్పే మాటలివి. ఇవన్నీ నిజమే! భారతీయులకు భరోసానిచ్చే విషయాలే. కానీ, పోలికలు పక్కనపెట్టి చూస్తే మనదేశంలో కూడా కేసుల సంఖ్య కొద్దిరోజులుగా ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఉదాహరణకు గత ఐదు రోజుల గణాంకాలనే పరిశీలిస్తే.. ఆదివారం (మే 3న) 2411, సోమవారం 2573 కేసులు, మంగళవారం 3875, బుధవారం 2,680, గురువారం 3,561 కేసులు నమోదయ్యాయి. ఏ రోజూ 2 వేల కేసులకు తక్కువ నమోదు కాలేదు. గత మూడు రోజుల సగటు అయితే 3,300 కేసులకు పైగానే ఉంది! లాక్‌డౌన్‌ ప్రకటించడానికి ముందు ఆ సంఖ్య (మూడు రోజుల సగటు) కేవలం 76. కేసుల సంఖ్య గత రెండు రోజుల్లో 14ు మేర పెరిగింది. గత 4 రోజుల లెక్క చూస్తే 25శాతం మేర పెరిగినట్టు. ఈ వేగం ఇలాగే కొనసాగితే మరో 5 రోజుల్లో కేసుల సంఖ్య 75 వేలకు చేరుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాశ్చాత్యదేశాలతో కాకుండా ఆసియా ఖండంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తే మనదేశంలో కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది.


యాక్టివ్‌ కేసుల్లో..

దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్నది మహారాష్ట్రలోనే. అక్కడ 13,013 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర తర్వా త.. గుజరాత్‌ (4729), ఢిల్లీ (3925), తమిళనాడు (3278), మధ్యప్రదేశ్‌ (1854) రాష్ట్రాల్లో అత్యధికంగా యాక్టివ్‌ కేసులున్నాయి. దేశంలోని యాక్టివ్‌ (35,902) కేసుల్లో దాదాపు 75ు ఈ ఐదు రాష్ట్రాల్లోనివే కావడం గమనార్హం. కేసుల్లో అగ్రస్థానంలో ఉన్న మరో 5 రాష్ట్రాలనూ కలుపుకొంటే మొత్తం 93శాతం పేషెంట్లు ఆ 10 రాష్ట్రాల్లోనివారే. ఇక మరణాల విషయానికొస్తే.. గత వారం రోజుల్లో దేశంలో సంభవించిన కరోనా మరణాల్లో 51ు పశ్చిమ బెంగాల్‌; గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలవే. 


ఆ దేశాల్లో తగ్గిందిగానీ..

యూరప్‌ దేశాల్లో.. ముఖ్యంగా కరోనా వైరస్‌ విలయం సృష్టించిన ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు విధించిన 3 వారాల తర్వాత పరిస్థితి మెరుగైంది. కొత్త కేసుల నమోదు తగ్గింది. మార్చి 14న లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించిన స్పెయిన్‌లో ఆరోజు కేసుల సంఖ్య 6,391 కాగా.. ఏప్రిల్‌ 1కి కేసుల (8036) సంఖ్య పతాకస్థాయికి చేరి, ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గడం మొదలైంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య ఏప్రిల్‌ 23న పతాకస్థాయి (99,501)కి చేరి.. అక్కడి నుంచి తగ్గుముఖం పట్టింది. ఇటలీలోనూ అంతే. అక్కడ మార్చి 21 నాటికి కేసుల నమోదు పతాకస్థాయికి చేరి ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. అంటే.. ఒకరకంగా లాక్‌డౌన్‌ ఆ రెండు దేశాల్లోనూ ఫలితాలను ఇచ్చినట్టేనన్నమాట. ఫ్రాన్స్‌లోనూ మార్చి 17న లాక్‌డౌన్‌ విధించగా.. ఏప్రిల్‌ 3నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మధ్యలో నాలుగైదు రోజులు మినహా మిగతా అన్ని రోజులూ కేసుల సంఖ్య బాగా తగ్గింది. యూకేలో మార్చి 23న లాక్‌డౌన్‌ విధించగా.. ఏప్రిల్‌ 10న అత్యధికంగా 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఆ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఆ దేశాల్లో కూడా లాక్‌డౌన్‌ కొంతమేరకు ఫలితాలనిచ్చినట్టే. కానీ, మనదేశంలో కేసులు పెరిగే వేగం బాగా తక్కువగా ఉన్నా.. కేసుల సంఖ్య మాత్రం నిలకడగా పెరుగుతూనే ఉంది. పైగా లాక్‌డౌన్‌ విధించిన 3 వారాలకు ఆ దేశాల్లో సహజంగా నే వైరస్‌ వ్యాప్తి పతాకస్థాయికి చేరింది. ఆ తర్వాత సహజంగానే తగ్గడం మొదలుపెట్టింది. మనదేశంలో ఇంకా అలా పతాకస్థాయికి చేరలేదు. మనదేశ జనాభా దాదాపు 135 కోట్లు. అందులో దాదాపుగా 52 వేల మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. అంటే.. దేశ జనాభాలో కేవలం 0.003 శాతం మంది మాత్రమే వైరస్‌ బారిన పడ్డారు. దేశ జనాభాతో పోలిస్తే ఇది చాలా తక్కువ. మనదగ్గర.. వైరస్‌ సోకినా ఎటువంటి లక్షణాలూ లేనివారి సంఖ్య ఎక్కువగా ఉందని.. పరీక్షలు ఇంకా ఎక్కువగా జరిగితే అలాంటి మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. వారివాదన ప్రకారం.. దేశంలో కేసుల సంఖ్య పతాకస్థాయికి చేరడానికి మరికొంత సమయం ఉంది.


నిలకడగా పెరుగుతున్నాయి..

లాక్‌డౌన్‌ విధించి 40 రోజులు దాటినా దేశంలో కరోనా కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించట్లేదని ఢిల్లీలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. ‘దేశంలో కరోనా కేసులు నిలకడగా పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య పతాకస్థాయికి ఎప్పుడు చేరుతుందో చెప్పడం కష్టమేగానీ.. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న తీరు, మోడలింగ్‌ డేటా ప్రకారం జూన్‌-జూలై నెలల్లో కొవిడ్‌-19 పేషెంట్ల సంఖ్య గరిష్ఠస్థాయికి చేరే ప్రమాదం ఉంది. మరింత జాగ్రత్తగా వ్యవహరించి కేసుల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలి. మరికొంతకాలం పాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలి’’ అన్నారు. ప్రస్తుతం ఎక్కువగా పరీక్షలు చేస్తున్నందున కేసుల సంఖ్య కూడా పెరుగుతోందని.. పరీక్షలు చేయించుకున్నవారిలో 4 నుంచి 4.5ు మందికి మాత్రమే వైరస్‌ పాజిటివ్‌ వస్తోందని తెలిపారు. 


ఆ ఆరు నగరాల్లో నియంత్రణే కీలకం

నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌

కొవిడ్‌-19పై భారతదేశం చేస్తున్న యుద్ధంలో గెలవాలంటే అందుకు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌, పుణె, చెన్నై, ఇండోర్‌, ఠాణే, జైపూర్‌ నగరాల్లో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడమే కీలకమని నీతీఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అన్నారు. దేశంలో ఇప్పటిదాకా నమోదైన కేసులో 20 శాతం ముంబైలో నమోదైనవేనని.. ఆ తర్వాత ఢిల్లీ (11%), అహ్మదాబాద్‌ (దాదాపు 9%), పుణె (దాదాపు 4%), చెన్నై (4%), ఇండోర్‌ (దాదాపు 3%), ఠాణే (దాదాపు 3%), జైపుర్‌ (దాదాపు 2.5%) నగరాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ నగరాల్లో టెస్టింగ్‌ (వైద్యపరీక్షలు), కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ (వైరస్‌ బారిన పడినవారితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించడం), సామాజిక నిఘా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. 


లాక్‌డౌన్‌ ఎత్తివేతకు తొందరొద్దు కేసులు భారీగా పెరిగిపోతాయ్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

లాక్‌డౌన్‌ గడువును మే 17 దాకా కేంద్రం, 29 దాకా రాష్ట్ర ప్రభుత్వం పొడిగించినా.. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఇన్నా ళ్లూ ఉన్నంత కఠినంగా లేవు. గ్రీన్‌, ఆరెంజ్‌, రెడ్‌జోన్లంటూ రకరకాల సడలింపులను ప్రభుత్వాలు ఇచ్చాయి. మనమే కాదు.. జర్మనీ, స్పెయిన్‌, ఇటలీ తదితర దేశాలు కూడా దశలవారీగా ఆంక్షలను సడలిస్తున్నాయి. దీంతో ప్రజలు భారీగా రోడ్లమీదకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఎత్తివేత విషయంలో తొందరపాటు వద్దని, అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకోకుండా ఎత్తేస్తే కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుందని ప్రపం చ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అన్ని దేశాలనూ హెచ్చరించింది. వైర్‌సను కట్టడి చేయాలంటే సమర్థమైన ట్రాకింగ్‌ వ్యవస్థ, క్వారంటైన్‌ సౌకర్యాలు ఉండాలని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌వో ఎపిడమాలజిస్టు మరియా వాన్‌ కెర్ఖోవ్‌ కూడా అదే ఆందోళన వ్యక్తం చేశారు. తొందరపడి లాక్‌డౌన్‌ను ఎత్తేస్తే వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. Updated Date - 2020-05-08T07:15:08+05:30 IST