‘జో బిడెన్ అమెరికా అధ్యక్షుడైతే, భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు’
ABN , First Publish Date - 2020-07-19T18:31:41+05:30 IST
నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ ప్రెసిడెన్షియల్ నామినీ జో

న్యూఢిల్లీ : నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ ప్రెసిడెన్షియల్ నామినీ జో బిడెన్ గెలిస్తే, ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశం శాశ్వత సభ్యత్వం పొందేందుకు సాయపడతారని భారత దేశానికి అమెరికా మాజీ రాయబారి రిచర్డ్ వర్మ చెప్పారు.
ఇండియన్-అమెరికన్ అయిన వర్మ 2014 నుంచి 2017 వరకు భారత దేశానికి అమెరికా రాయబారిగా పని చేశారు. నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్‌కు ఓటు వేయాలని ఆయన ప్రచారం చేస్తున్నారు. భారత సంతతి ప్రజలు బిడెన్‌కు మద్దతివ్వాలని కోరుతున్నారు.
జో బిడెన్ నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే, ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశం శాశ్వత సభ్యత్వం పొందేందుకు సాయపడతారని వర్మ తెలిపారు.
‘‘జో బిడెన్ మన ప్రజలను ఉమ్మడిగా సురక్షితంగా ఉంచేందుకు భారత దేశంతో కలిసి పని చేస్తారు. క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి వ్యతిరేకంగా నిలుస్తారు, భారత దేశ పొరుగు దేశాలు యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తే భారత దేశానికి అండగా ఉంటారు’’ అని వర్మ పేర్కొన్నారు.
అయితే, జో బిడెన్ కశ్మీరు, పౌరసత్వ సవరణ చట్టం విషయంలో భారత దేశాన్ని విమర్శిస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే.
ఐరాస సంస్కరణలకు భారత్ పిలుపు
ఐక్య రాజ్య సమితి (ఐరాస) ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేదని, భద్రతా మండలితో సహా ఐరాసను సంస్కరించాలని భారత దేశం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. భద్రతా మండలిలో ప్రస్తుతం 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. అవి : అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా. వీటితోపాటు మరొక 10 సాధారణ సభ్య దేశాలు ఉన్నాయి. మన దేశానికి కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరుతున్నారు.
భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు చైనా మాత్రమే అడ్డంకిగా ఉంది. మన దేశానికి శాశ్వత సభ్యత్వం రావాలంటే, ఈ ఐదు శాశ్వత సభ్య దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం తప్పనిసరి.
నాన్ పర్మినెంట్ మెంబర్‌గా భారత్ ఎన్నిక
భారత దేశం, ఐర్లాండ్, మెక్సికో రెండేళ్ళ నాన్ పర్మినెంట్ మెంబర్స్‌గా ఎన్నికయ్యాయి. ఈ పదవీ కాలం 2021 జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది.