సుశాంత్ కేసు: ‘రియాకు ఆదిత్య ఎవరో తెలియదు’

ABN , First Publish Date - 2020-08-18T22:48:26+05:30 IST

దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తికి మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరేతో...

సుశాంత్ కేసు: ‘రియాకు ఆదిత్య ఎవరో తెలియదు’

ముంబై: దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తికి మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరేతో ఎలాంటి పరిచయం లేదని ఆమె తరపు న్యాయవాది సతీశ్ మనేషిండే పేర్కొన్నారు. ఆమె ఆదిత్య థాకరేను ఎప్పుడూ కలుసుకోలేదనీ.. కనీసం మాట్లాడనుకూడా లేదని ఆయన అన్నారు. ‘‘రియాకి ఆదిత్య థాకరే ఎవరో ఇప్పటికీ తెలియదు. ఆయన్ను ఎప్పుడూ కలుసుకోలేదు. కనీసం టెలిఫోన్ ద్వారా గానీ, మరే రూపంలో గానీ ఆమె ఎప్పుడూ ఆయనతో మాట్లాడలేదు. ఆదిత్య థాకరే శివసేనకు చెందిన ఓ నాయకుడు అని మాత్రం ఆమెకు తెలుసు...’’ అని మనేషిండే ఇవాళ  ఓ ప్రకటనలో వెల్లడించారు. సుశాంత్ కేసులో ముంబై పోలీసులు, ఈడీ అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఎలక్ట్రానిక్, ఫోరెన్సిక్, మెడికల్, డీఎన్ఏ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు, సీసీటీవీ, సీడీఆర్, ఎలక్ట్రానిక్ డేటా ఈ రెండు దర్యాప్తు సంస్థల వద్దకు చేరినట్టు లాయర్ వెల్లడించారు. అయినప్పటికీ ఇంత వరకు రియా మీద ఒక్క ఆరోపణ కూడా గుర్తించలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులు సుప్రీం కోర్టులో కూడా నివేదక సమర్పించారనీ.. ఒకవేళ మూడో దర్యాప్తు సంస్థతో విచారణ చేయించినా ఎదుర్కునేందుకు రియా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.


‘‘నేటి ఎలక్ట్రానిక్ యుగం పుణ్యమాని ఆధారాలను తారుమారు చేసే అవకాశమే లేదు. ఈ కేసులో వాస్తవాలు బయటికి వచ్చేవరకు మీడియా కొంత సంయమనం పాటించాలి. తనపై వచ్చిన ఆరోపణలపై రియా మౌనంగా ఉన్నంత మాత్రాన వాటిని అంగీకరించినట్టు కాదు. నిజాలు త్వరలోనే నిగ్గుతేలతాయి...’’ అని మనేషిండే పేర్కొన్నారు.  కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఇప్పటికే ఆదిత్య థాకరే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేవలం తనపై రాజకీయంగా బురదజల్లేందుకే కొందరు ఈ దుష్ర్పచారానికి ఒడిగట్టారనీ.. తాను ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోదల్చుకోలేదని ఆయన అన్నారు. 

Updated Date - 2020-08-18T22:48:26+05:30 IST