మైసూరులో ‘రివర్స్‌ క్వారంటైన్‌’

ABN , First Publish Date - 2020-10-07T08:19:45+05:30 IST

కరోనా వ్యాధి లక్షణాలున్నా.. అలాంటి వారితో సన్నిహితంగా మెలిగినా క్వారంటైన్‌కు పంపుతారు. మరి రివర్స్‌ క్వారంటైన్‌ అంటే ఏమిటో తెలుసా? కరోనా వ్యాధి సోకకుండా ఆరోగ్యవంతులైన వారు ప్రత్యేక గదుల్లో గడిపితే దాన్ని రివర్స్‌ క్వారంటైన్‌ అంటారు...

మైసూరులో ‘రివర్స్‌ క్వారంటైన్‌’

బెంగళూరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాధి లక్షణాలున్నా.. అలాంటి వారితో సన్నిహితంగా మెలిగినా క్వారంటైన్‌కు పంపుతారు. మరి రివర్స్‌ క్వారంటైన్‌ అంటే ఏమిటో తెలుసా? కరోనా వ్యాధి సోకకుండా ఆరోగ్యవంతులైన వారు ప్రత్యేక గదుల్లో గడిపితే దాన్ని రివర్స్‌ క్వారంటైన్‌ అంటారు. కర్ణాటక రాష్ట్ర సాంస్కృతిక రాజధాని మైసూరు నగరంలో కొద్దిరోజులుగా కరోనా కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరిగిపోతుండటంతో వృద్ధులు, చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది.


వీలైనంతవరకు వృద్ధులు, ఆరోగ్యవంతులను రివర్స్‌ క్వారంటైన్‌లో ఉండాలని కోరింది. వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ బెంగళూరులో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... మైసూరు నగరంలో వారం వ్యవధిలోనే కరోనా పీడితుల్లో 3.6 శాతం మృత్యువాత పడటం ఆందోళన రేకెత్తిస్తోందన్నారు. రెండు రోజుల క్రితం మైసూరులో కరోనా బారిన పడి ఒకేరోజు 25 మంది మృతి చెందారని గుర్తు చేశారు. కాగా హోం ఐసొలేషన్‌లలో ఉంటున్న వారిపై నిఘా విధించామని మైసూరు జిల్లా కలెక్టర్‌ రోహిణి సింధూరి వెల్లడించారు.

Read more