రెస్టారెంట్లను మూసేయాలి, 20 మందికి మించి గుమిగూడొద్దు : ఢిల్లీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-03-20T01:31:12+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం కోసం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం గురువారం కఠిన చర్యలను ప్రకటించింది. అన్ని రెస్టారెంట్లను మూసేయాలని, సామాజిక కార్యక్రమాల్లో 20 మందికి మించి పాల్గొనరాదని పేర్కొంది.

రెస్టారెంట్లను మూసేయాలి, 20 మందికి మించి గుమిగూడొద్దు : ఢిల్లీ ప్రభుత్వం

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం కోసం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం గురువారం కఠిన చర్యలను ప్రకటించింది. అన్ని రెస్టారెంట్లను మూసేయాలని, సామాజిక కార్యక్రమాల్లో 20 మందికి మించి పాల్గొనరాదని పేర్కొంది. ఐఐటీ ఢిల్లీతో సహా అన్ని విద్యా సంస్థలను మూసేయాలని తెలిపింది. 


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 31 వరకు ఢిల్లీలోని అన్ని రెస్టారెంట్లను మూసేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెస్టారెంట్లలో భోజనం, టిఫిన్ చేయడంపై నిషేధం విధించామని, అయితే ఆహార పదార్థాలను ఇళ్ళకు తీసుకెళ్ళి తినవచ్చునని చెప్పారు. 


సామాజిక కార్యక్రమాల్లో 20 లేదా అంత కన్నా ఎక్కువ మంది పాల్గొనడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. సాంఘిక, సాంస్కృతిక, మతపరమైన, విద్యా సంబంధమైన, సెమినార్లు, సమావేశాలు మొదలైనవాటిలో 20 లేదా అంతకన్నా ఎక్కువ మందిని అనుమతించబోమన్నారు. 


క్వారంటైన్‌లో ఉండాలని ఎవరికైనా చెప్పినపుడు, వారు ఆ ఆదేశాలను పాటించకుండా, పారిపోతే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేజ్రీవాల్ హెచ్చరించారు. అరెస్టు చేసి, కేసు నమోదు చేస్తామన్నారు. 


కరోనా వైరస్ బాధితుల కోసం ఢిల్లీలో 768 పడకలను సిద్ధం చేశామని చెప్పారు. ప్రస్తుతం 57 పడకలపై వ్యాధిగ్రస్థులు చికిత్స పొందుతున్నారన్నారు. ఈ వ్యాధిని నియంత్రించడంలో తాము విజయం సాధించినట్లు తెలిపారు. ఇది ప్రస్తుతం సామాజిక వ్యాప్తి దశలో లేదన్నారు. 


ఢిల్లీలో 10 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఒకరు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు కోలుకున్నారని తెలిపారు. మిగిలిన ఆరుగురి పరిస్థితి బాగుందన్నారు.


Updated Date - 2020-03-20T01:31:12+05:30 IST