రిపబ్లిక్ రిపోర్టర్‌పై జర్నలిస్టుల దాడి

ABN , First Publish Date - 2020-09-24T22:57:04+05:30 IST

అయినప్పటికీ భండారి తన వ్యాఖ్యలకు కొనసాగింపునిస్తుండడంతో చిర్రెత్తుకొచ్చిన జర్నలిస్టులు.. అతడిపై భౌతికదాడికి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని నిలువరించి పరిస్థిని అదుపులోకి తీసుకువచ్చారు

రిపబ్లిక్ రిపోర్టర్‌పై జర్నలిస్టుల దాడి

ముంబై: రిపబ్లిక్ టీవీ రిపోర్టర్‌పై మిగతా చానల్స్‌కు చెందిన జర్నలిస్టులు దాడికి దిగారు. జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. న్యూస్ కవర్ చేస్తున్న సమయంలో రిపబ్లిక్ టీవీ రిపోర్టర్.. మిగతా చానల్ సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారు దాడికి పాల్పడ్డారని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.


ముంబైలోని ‘మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో’ (ఎన్‌సీబీ) కార్యాలయానికి న్యూస్ కవర్ చేయడానికి వివిధ చానళ్లకు చెందిన రిపోర్టర్లు, కెమెరామెన్‌లు వచ్చారు. జర్నలిస్టులంతా న్యూస్ కవర్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇంతలో రిపబ్లిక్ టీవీకి చెందిన ప్రదీప్ భండారి అనే రిపోర్టర్.. తన చానల్ కెమెరాను మిగతా రిపోర్టవైపు తిప్పి  ‘‘వీళ్లు మానసిక రోగులు. ఛాయ్, బిస్కెట్ల కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్లు నిజాలు చెప్పరు. మేము మాత్రమే నిజాలు చూపిస్తాం’’ అని వ్యాఖ్యానించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మిగతా చానల్స్ జర్నలిస్టులు ‘‘రిపోర్టింగ్ చేసుకో, కాస్త జాగ్రత్తగా మాట్లాడు’’ అని హెచ్చరించారు.


అయినప్పటికీ భండారి తన వ్యాఖ్యలకు కొనసాగింపునిస్తుండడంతో చిర్రెత్తుకొచ్చిన జర్నలిస్టులు.. అతడిపై భౌతికదాడికి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని నిలువరించి పరిస్థిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఎన్‌డీటీవీ, ఎబీపీ న్యూస్ చానళ్లకు చెందిన గూండాలు తనపై దాడి చేశారని ప్రదీప్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కాగా, ఎన్డీటీవీకి చెందిన సౌరబ్ గుప్తా.. ‘ఎన్డీటీవీ సిబ్బంది ఎంతో బాధ్యతాయుతంగా సరిగానే ప్రవర్తించారు’’ అని సమర్ధించుకున్నారు.

Updated Date - 2020-09-24T22:57:04+05:30 IST