స్వాతంత్ర్య దినోత్సవ వేళ… స్వరాజ్య సంగ్రామ విస్మృత వీరుల స్మరణ

ABN , First Publish Date - 2020-08-16T05:30:00+05:30 IST

ఇవాళ మనం 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా భారతం...

స్వాతంత్ర్య దినోత్సవ వేళ… స్వరాజ్య సంగ్రామ విస్మృత  వీరుల స్మరణ

74వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వరాజ్య సంగ్రామంలో పాల్గొన్న పలువురు వీరులను స్మరించుకుంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆయన చేసిన పోస్ట్ యథాతథంగా...


ఇవాళ మనం 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా భారతం.


బ్రిటీష్ పాలన భారతదేశ అభివృద్ధికి సంకెళ్ళు వేసి దేశాన్ని బలహీనపరచింది. మన సంస్కృతిని కూలదోసే ప్రయత్నం చేసింది. ఫలితంగా ఘనమైన గతంలో కొంత భాగాన్ని భారతీయులు కోల్పోవలసి వచ్చింది. పాశ్చాత్య మనస్తత్వం నుంచి బయటకు రావడం తక్షణావసరం. భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనంతో పాటు మన జాతీయ భాషల సాహిత్యం, కళాత్మక వ్యక్తీకరణలకు పూనర్వైభవం తీసుకు వచ్చే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.


పరాయి పాలకులు మన దేశాన్ని దోచుకోవడమే గాక, దేశంలో కుల, మత, ప్రాంత, వ్యక్తిగత విద్వేషాలను పెంచి పోషించి వెళ్ళారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వేషం-భాష వేరైనా, కులం-మతం వేరైనా మనమంతా భారతీయులం అనే భావనను ప్రతి ఒక్కరం, ముఖ్యంగా యువతరం మనసుల్లో నింపుకోవాలి. విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులు, శక్తులను దూరంగా పెట్టాలి. ఈ దిశగా మనమంతా ప్రతిజ్ఞ బూనాలి.


130 కోట్ల జనశక్తితో, పునరుత్తేజ సంకల్పంతో నవభారత నిర్మాణం దిశగా యావత్ దేశం ముందుకు కదులుతున్న నేపథ్యంలో, మన గతవైభవాన్ని తిరిగి పొందడమే గాక, ఆదర్శవంతమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంగా మన దేశం, కీర్తి శిఖరాలను అధిరోహిస్తుందని నా విశ్వాసం. అభివృద్ధి మార్గంలో భారతదేశం ఉన్నత స్థితికి ఎదగడానికి, ప్రజాప్రతినిధులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రతి భారతీయుడు తమ విధిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలి.

గత ఐదేళ్ళలో, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా సామాజిక భద్రతా వలయాన్ని బలోపేతం చేయడం జరిగింది. భారతదేశంలో విద్యుత్ వెలుగులు లేని ప్రాంతం లేదు. దేశాన్ని బహిరంగ విసర్జన రహితంగా ప్రకటించుకున్నాము. వ్యవసాయ రంగం సహా వివిధ రంగాల్లో కీలకమైన స్కరణలతో మన ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకున్నాం. పారదర్శకతను ప్రోత్సహించేందుకు, నిజాయితీ గల పన్ను చెల్లింపు దారులను ప్రోత్సహించే దిశగా ఇటీవల పన్నుల సంస్కరణలను ప్రభుత్వం ప్రకటించింది.


2022 నాటికి మనం స్వేచ్ఛా వాయువులు పీల్చి, 75 ఏళ్ళను పూర్తి చేసుకుంటున్న తరుణంలో, ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు సాగేందుకు ఇది సరైన సమయం. 2022 నాటికి ఓ దేశంగా, ఏకీకృతమై ఏమి సాధించాలనుకుంటున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర భాయ్ మోడీ ఇచ్చిన “సంకల్ప్ సే సిద్ధి” పిలుపు మన ఆలోచన, ప్రవర్తనలో మార్పు తీసుకు వచ్చి, 2022-23 నాటికి ఓ సరికొత్త భారతదేశం దిశగా తీసుకువెళ్ళే స్పష్టమైన పిలుపు.


2020 నాటికి భారతదేశంలో నిరాశ్రయులనే వారు ఉండకూడదు. ప్రతి పౌరుడికి విద్య, ఉపాధి, ఆరోగ్య సౌకర్యాలు, శుభ్రమైన ఆహారం మరియు తాగునీరు మరియు మంచి పారిశుద్ధ్యం దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.


2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మన లక్ష్యం. జన శక్తిని వినియోగించుకునేందుకు యువత నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాలి. దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు, హిజ్రాలు వంటి వ్యక్తులతో సహా సమాజంలోని అట్టడుగు వర్గాల వరకూ ఉత్పాదకత, సంపన్నత, ప్రశాంతమైన జీవన విధానం అందాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ముందుకు సాగే మార్గంలో అంత్యోదయ, సర్వోదయకు ప్రాధాన్యం పెంచాలి. 2022 నాటి భారతదేశం ఆత్మనిర్భర్ స్ఫూర్తిని సాధించాలి. పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక వివక్ష, లింగ వివక్షను అంతం చేసేందుకు మరియు అవినీతి నిర్మూలన కోసం మనమంతా నూతన శక్తితో, దృఢ నిశ్చయంతో కర్తవ్య బద్ధులమై ముందుకు సాగాలి.  

ఈ రోజు ఇంతటి స్వేచ్ఛను మనం పొందగలుగుతున్నామంటే దానికి కారణం ఎంతో మంది మహనీయుల త్యాగాలు. వారి నిస్వార్థ దేశభక్తికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే పోరాటం ఒక్క రోజులో ముగిసేది కాదు. అద్భుతాలు ఒక్కరు మాత్రమే సాధించేవి కావు. ముఖ్యంగా భారత స్వరాజ్య సంగ్రామ చరిత్ర ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన స్వేచ్ఛా ఇతిహాసం. ఈ పోరాటంలో ప్రాణాలు అర్పించిన వారు కొందరైతే, సర్వ శక్తులు ఒడ్డి పోరాడిన వారు మరికొందరు, తమ ఆస్తులను సైతం పణంగా పెట్టి స్వరాజ్య కాంక్షను బలంగా ఎలుగెత్తి చాటిన వారు ఇంకొందరు. ఒక్క సారి మననం చేసుకుంటే కొందరు జాతీయ నాయకులే మనకు జ్ఞప్తికి వస్తారు. వీళ్ళ పాత్ర గొప్పదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే స్వాతంత్య్ర ఉద్యమానికి ఆయా ప్రాంతాల్లో ప్రాచుర్యం కల్పించిన ఇతర దేశభక్తుల ఘనతను గుర్తు పెట్టుకోవలసిన అవసరం ఉంది. వారి శౌర్యం, త్యాగం ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. వాస్తవానికి వీరిని జాతీయ వీరులుగా స్మరించుకుని గౌరవించాలి. ప్రతి నిప్పుకణిక తానేంటో చూపిస్తూనే ఉంటుంది. చెదలంటకుండా చరిత్రను శాసిస్తూనే ఉంటుంది. అలాంటి లక్షలాది మంది ఉన్న ఈ జాబితాలో కొంత మంది విస్మృత వీరులను స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భంలో స్మరించుకోవడం మనందరి బాధ్యత.


అల్లూరి సీతారామరాజు చివరి క్షణం వరకు బ్రిటీషర్లతో నిర్విరామంగా పోరాడిన ఘనత అల్లూరి సొంతం. 1922-24 మధ్యలో స్థానిక గిరిజనుల్లో స్ఫూర్తిని నింపి ‘రంపా ఉద్యమా’నికి నేతృత్వం వహించారు. ఆయన ధైర్య సాహసాలకు గుర్తింపుగా తెలుగు ప్రజలు “మన్యం వీరుడు” అని పిలుచుకుంటారు.


చిన్నస్వామి సుబ్రమణ్య భారతీయార్ ఓ గొప్ప తమిళ కవి, రచయిత, పాత్రికేయుడు, సాంఘిక సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు కూడా. వారి జాతీయవాద సాహిత్యం.. బ్రిటీషర్ల నిరంకుశపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసే దిశగా ప్రజల్లో స్ఫూర్తిని రేకెత్తించింది. మాతంగిని హజ్రా ఈమెను ప్రజలు అభిమానంగా వరిష్ట మహిళా గాంధీగా పిలుచుకునేవారు. సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఓ ర్యాలీ సందర్భంగా పోలీసులు ఆమెపై మూడు మార్లు కాల్పులు జరిపినా వందేమాతరం అని నినదిస్తూ త్రివర్ణ పతాకాన్ని చేతబూని ముందుకు సాగిన ధీర వనిత.

బేగం హజ్రత్ మహల్

1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఆమె భర్తను బ్రిటిషర్లు దేశం నుంచి బహిష్కరించినప్పటికీ... ఏ మాత్రం వెనుకాడక అవథ్ ప్రాంతంలో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. బ్రిటీషర్ల చెరనుంచి లక్నో ప్రాంతాన్ని విజయవంతంగా హస్తగతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించారు.


పాండురంగ మహదేవ్ బాపట్

సేనాపతి బాపట్‌గా అందరూ పిలుచుకునే ఈయన.. యవ్వనంలో సావర్కర్ సోదరులతో కలిసి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. అనంతరం గాంధేయవాదం పట్ల ఆకర్షితుడయ్యారు. 1921లో ముల్షీ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన సత్యాగ్రహ నిర్వహణలో వీరి పాత్రను చరిత్ర స్మరిస్తూనే ఉంటుంది.


పొట్టి శ్రీరాములు

మహాత్మాగాంధీకి అత్యంత విశ్వసనీयययయ అనుచరుల్లో ఒకరు. ఒక దశలో గాంధీజీ “శ్రీరాములు వంటి 11 మంది నాతో ఉంటే.. ఏడాదిలో దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తాను” అని అన్నారంటే.. పొట్టి శ్రీరాములు పోరాట పటిమను అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన దేశభక్తుడు.


అరుణ అసఫ్ అలీ

ఉప్పు సత్యాగ్రహంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. తమకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతోందంటూ బ్రిటీషర్లు ఆమెను అరెస్టుచేశారు. 1931లో గాంధీ-ఇర్విన్ ఒడంబడిక సందర్భంగా ఆమె విడుదలయ్యారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా బాంబేలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఘటన ద్వారా ఆమె ఎప్పటికీ గుర్తుండిపోతారు.


గరిమెళ్ల సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ గొప్ప రచయిత, కవి, స్వాతంత్ర్య సమరయోధుడు. తన రచనలు, పాటలు, ప్రసంగాల ద్వారా యువతలో స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని మేల్కొలిపారు. ఫలితంగా అనేక మార్లు జైలుపాలయ్యారు. అయినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే వచ్చారు.


లక్ష్మీ సెహగల్

భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్ర గర్వించే మరో స్వాతంత్ర్య సమరయోధురాలు. ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యురాలిగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఓ మహిళా సైనిక దళాన్ని ప్రారంభించి.. దానికి “రాణి ఝాన్సీ లక్ష్మీ బాయి” పేరు పెట్టారు. కెప్టెన్ లక్ష్మిగా సమరోద్యమాన్ని ముందుండి నడిపి ఎందరో మహిళలు, యువతులకు స్ఫూర్తిగా నిలిచారు.


బిర్సాముండా

స్వాంత్రత్ర్యోద్యమంలో మెరిసిన గిరిజన పోరాటయోధుల్లో ముందువరసలో ఉంటారు. గిరిజన తెగలు ఎక్కువగా ఉండే బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా అందరినీ ఏకం చేసే దిశగా వీరు పోషించిన పాత్ర చిరస్మరణీయం.


పార్బతి గిరి

స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొనడమే గాక, ఉన్నతమైన సేవా కార్యక్రమాలతో పశ్చిమ ఒడిశా మదర్ థెరిసాగా పేరుగాంచిన మహనీయురాలు. పలుమార్లు జైలు పాలు అయినా, తమ కార్యక్రమాలను కొనసాగించారు. స్వాతంత్ర్యానంతరం వెనుకబడిన వర్గాలు, అనాథలు, దీన జనోద్ధరణకే జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత మూర్తి.


టిరోట్ సింగ్

ఖాసీ అనే గిరిజన తెగ నాయకుడు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా సాగిన తొలి తరం పోరాటయోధుల్లో ఈయన ఒకరు. బ్రిటిషర్ల ఖాసీ హిల్స్‌ ఆక్రమణకు ప్రతీకారంగా చిరస్మరణీయ పోరాటాన్ని చేశారు.


కనక్ లతా బారువా

అస్సాంలోని గోహ్‌పూర్ ప్రాంతానికి చెందిన బారువా ‘మృత్యువాహిని’ పేరుతో ఏర్పాటైన ఓ యువ స్వాంతంత్ర్య పోరాట యోధుల బృందంలో చేరారు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా జాతీయ జెండాను చేతబూని ర్యాలీ నిర్వహిస్తూ, పోలీసులు జరిపిన కాల్పుల్లో అమరుడయ్యారు.


కన్నెగంటి హనుమంతు

బ్రిటీషర్లతో జరిగిన పోరాటంలో 30 ఏళ్లకే అమరుడయ్యారు. పల్నాడు ప్రాంతంలో అధిక పన్ను వసూళ్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. యువతను రెచ్చగొడుతున్నాడంటూ పలుమార్లు అరెస్టు చేసినా, ఏ మాత్రం వెరవకుండా స్వరాజ్య స్ఫూర్తిని ప్రదర్శించిన దేశభక్తుడు.


షహీద్ ఖుదీరామ్ బోస్

ముజఫర్ పూర్ కుట్రగా పిలిచే పోరాటాన్ని ప్రపుల్ల చాకీతో కలిసి ముందుకు నడపడమే గాక, బ్రిటీషర్లకు కంటి మీద కునుకు లేకుండా చేసిన యువకెరటం. 18 ఏళ్ళకే ఉరికొయ్యలను ముద్దాడిన ఈ దేశభక్తుడు, స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అమరులైన యువకెరటాల్లో ఒకరు.


వేలు నాచియార్

ప్రథమస్వాతంత్ర్య  పోరాటానికి ముందే బ్రిటీష్ పాలనను వ్యతిరేకించిన ధీర వనిత. అందుకే ఆమెను వీరమాంగై (వీర వనిత) అని పిలుచుకుంటారు. బ్రిటీషర్ల నుంచి తమ సామ్రాజ్యాన్ని తిరిగిపొందిన అతికొద్దిమంది పాలకుల్లో నాచియార్ ఒకరు.కిట్టూర్ చెన్నమ్మ

మైసూరు ప్రాంతంలోని కిట్టూర్ రాజ్యానికి మహారాణి. 1824లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన ధీరవనిత. వారసుల్లేని రాజ్యాలను తమకు అప్పగించాలన్న ఈస్ట్ ఇండియా కంపెనీ శాసనాన్ని ధిక్కరించి చుక్కలు చూపించారు. కర్ణాటక గడ్డపై స్వరాజ్య బావుటా ఎగురవేసిన తొలి మహిళా తేజోమూర్తి.


వీర పాండ్య కట్టబొమ్మన్

తమిళనాడులోని పాంచాలన్ కురిచికి అధిపతి. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సార్వభౌమత్వాన్ని అంగీకరించేందుకు నిరాకరించి, వారితో భీకర పోరాటాన్ని చేశారు. చివరకు బ్రిటీషర్లు ఆయన్ను బంధించి ఉరి తీసినా, చివరి శ్వాస వరకూ బ్రిటీషర్లకు సింహస్వప్నంగా నిలిచారు.


వి.ఓ. చిదంబరం పిళ్లై

1906లో స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీని ప్రారంభించడం ద్వారా బ్రిటీష్ వారి జలమార్గ గుత్తాధి పత్యానికి వ్యతిరేకంగా భారతీయ షిప్పింగ్ సేవలను ప్రారంభించి గట్టి పోటీ ఇచ్చారు. 


సుబ్రమణియ శివ

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. బ్రిటీష్ వారి చేతుల్లో అరెస్టు అయ్యి మద్రాసు జైలులో శిక్షను అనుభవించిన తొలి రాజకీయ ఖైదీ కూడా ఆయనే.


సూర్య సేన్

భారత స్వరాజ్య ఉద్యమంలో ప్రభావవంతమైన పాత్ర పోషించిన బెంగాలీ నాయకుడు. 1930 నాటి చిట్టగాంగ్ ఆయుధ దాడులకు నాయకత్వం వహించి తమ ధీరత్వాన్ని చాటుకున్నారు. 


అష్ఫఖుల్లా ఖాన్

1924లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ (హెచ్.ఆర్.ఏ)ను స్థాపించారు. మహాత్మ గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినప్పుడు, దేశానికి స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సాయుధ విప్లవాలను నిర్వహించేందుకు సారూప్య స్వరాజ్య సమరయోధులతో హెచ్.ఆర్.ఏ. ను ఏర్పాటు చేశారు.


బతుకేశ్వర్ దత్

షాహిద్ భగత్ సింగ్ తో పాటు అసెంబ్లీలో బాంబులు విసిరిన స్వరాజ్య సమర యోధుడు. భారతీయ రాజకీయ ఖైదీల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు నిరసనగా భగత్ సింగ్ తో కలిసి చారిత్రక నిరాహార దీక్షను ప్రారంభించి, ఖైదీలు కొన్ని హక్కులను పొందేందుకు సహకారం అందించారు.


పింగళి వెంకయ్య

జాతీయ జెండా రూపశిల్పి. భాషావేత్తగా, భూ విజ్ఞాన శాస్త్రవేత్తగా, గాంధేయ వాదిగా, రచయితగా వారి స్ఫూర్తి చిరస్మరణీయం. 50 సంవత్సరాల పాటు మహాత్మ గాంధీతో సన్నిహితంగా ఉండి, సహకారం అందించారు.


దుర్గాభాయ్ దేశ్ ముఖ్

స్వాతంత్ర్య సమరయోధురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. రాజ్యాంగ సభ మరియు ప్రణాళికా సంఘం సభ్యురాలు. మహిళల అభ్యున్నతి కోసం పని చేశారు. 1937లో ఆంధ్ర మహిళా సభను స్థాపించి, మహిళల సాధికారత కోసం కృషి చేశారు.


అరబిందో ఘోష్

ప్రముఖ తత్వవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, యోగి, గురువు, కవి. అన్నింటికీ మించి గొప్ప జాతీయవాది. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా నిలిచి, అనంతరం ఆధ్యాత్మిక సంఘ సంస్కర్తగా దిశా నిర్దేశం చేశారు.


మేడమ్ భికాజీ కామా

1907 ఆగష్టులో స్టుట్ గార్ లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సదస్సులో భారత జాతీయ పతాక తొలి నమూనాను ఏగరేసిన జ్వలన చైతన్య జాతీయ వాదిగా, స్వాతంత్ర్య సమరయోధురాలిగా, మహిళా హక్కులను నినదించిన న్యాయవాదిగా జాతి ఆమెను గుర్తు పెట్టుకుంటుంది. భారతదేశంలో సాగుతున్న బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని, ముఖ్యంగా ప్రవాస భారతీయుల అభిప్రాయాలను సమీకరించేందుకు విస్తృత విదేశీ పర్యటనలు చేశారు.


మన స్వాతంత్ర్య సంగ్రామ విస్మృత వీరుల్లో వీరు కొందరు మాత్రమే. ఆయా సందర్భాల్లో బ్రిటీష్ సామ్రాజ్య దాహానికి వ్యతిరేకంగా అగ్నికణికలై జ్వలించిన మరెందరో మహనీయులు ఉన్నారు. దేశ ప్రజల స్వేచ్ఛ కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుని, వారికి నివాళులు అర్పించడం మనందరి కర్తవ్యం.


ఈ లాక్ డౌన్ కాలం గొప్ప పుస్తకాలను చదివేందుకు, ఇలాంటి గొప్ప నాయకుల జీవితాల గురించి అధ్యయనం చేసేందుకు తగినంత సమయాన్ని ఇచ్చింది. నవ భారత నిర్మాణానికి కట్టుబడి, ఉన్నతమైన భవిష్యత్ దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇలాంటి స్వరాజ్య యోధుల జీవితాలను అధ్యయనం చేయడం అత్యంత ఆవశ్యకం. ఆయా రాష్ట్రాలు వారి శౌర్య, త్యాగాల చరిత్రను పాఠ్య ప్రణాళికలో చేర్చాలి. వారి వారసత్వాన్ని ముందు తరాలకు తెలియజేసేందుకు చర్యలు తీసుకోవాలి. అప్పుడే వారి స్ఫూర్తిని భవిష్యత్ భారతావనికి అందించి, వారు కలగన్న భారతదేశాన్ని అంటే నిజమైన ఆత్మనిర్భర్ భారత్, శ్రేష్ట్ భారత్, సశక్త భారత్ ను నిర్మించగలం.


సర్వకాలం ప్రతికూల వాతావరణంలో కూ డా పని చేస్తూ, ప్రాణాలు అర్పిస్తూ మనకు రక్షణ కల్పిస్తున్న సైనికులకు వందనాలు అర్పించి, వారి త్యాగాలను గుర్తుపెట్టుకుని ముందుకు సాగాలి. కనీవినీ ఎరుగని మహమ్మారి కాలంలోనూ తమ విధులను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ మనకు ప్రాణ రక్షణ కల్పిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు, ఔషధాల కోసం కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు, ప్రస్తుత ప్రతి కూల పరిస్థితుల్లో తామెన్ని ఇబ్బందులు పడుతున్నా ఆరుగాలం కష్టపడి మనందరి కోసం ఆహారాన్ని పండిస్తున్న మన రైతన్నలను మనం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. కృతజ్ఞతలు తెలియజేయాలి. వీరందరికీ జేజేలు పలుకుతూ నవభారత నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరం కార్యోన్ముఖులం కావాలని ఆకాంక్షిస్తున్నాను.


- భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు

Updated Date - 2020-08-16T05:30:00+05:30 IST