కోవిడ్ స్ట్రయిన్ పొంచి ఉంది: మమతా బెనర్జీ
ABN , First Publish Date - 2020-12-28T21:27:25+05:30 IST
కొత్తగా దూసుకొస్తున్న కోవిడ్ స్ట్రయిన్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని పశ్చిమబెంగాల్ ..

కోల్‌కతా: కొత్తగా దూసుకొస్తున్న కోవిడ్ స్ట్రయిన్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. యుకేలో కోవిడ్ స్ట్రయిన్ తలెత్తిందని, ఇది అత్యంత శక్తివంతమైనదని తెలుస్తోందని ఆమె అన్నారు. 'సెకెండ్ వేవ్ రావచ్చు. అందుకు మనం సిద్ధంగా ఉండాలి. యూకే, ఇటలీలో తిరిగి లాక్‌డౌన్ మొదలైంది. మనం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఏ మాత్రం అజాగ్రత్త వద్దు' అని మమతా బెనర్జీ అన్నారు. బీర్బూమ్ జిల్లాలో సోమవారం జరిగిన అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్‌లో ఆమె మాట్లాడుతూ ఈ హెచ్చరికలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
యూకే నుంచి డిసెంబర్ 21న కోల్‌కతా తిరిగి వచ్చిన తర్వాత సుమారు ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. డిసెంబర్ 23 నుంచి యూకే నుంచి వచ్చే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్టు భారత్ ప్రకటించగా, దీనికి ముందు లండన్ నుంచి ఇండియా వచ్చిన చివరి విమానం ఇదే. కాగా, పశ్చిమబెంగాల్‌లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులతో జరిన సమావేశంలో మమతా బెనర్జీ పేర్కొన్నారు. నవంబర్ 1 నాటికి 37,761 యాక్టివ్ కేసులు ఉండగా, డిసెంబర్ 27 నాటికి అవి 13,774కు తగ్గినట్టు చెప్పారు. ఇంతవరకూ రాష్ట్రంలో 5,47,443 కోవిడ్-19 కేసులు నమోదు కాగా, 9,598 మంది మృత్యువాత పడ్డారు.