పీఎం- కేర్స్ ఫండ్‌కు ముఖేష్ అంబానీ భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే...

ABN , First Publish Date - 2020-03-31T01:39:34+05:30 IST

పీఎం-కేర్స్ సహాయనిధికి భారత్‌లోని దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ మొత్తాన్ని విరాళంగా...

పీఎం- కేర్స్ ఫండ్‌కు ముఖేష్ అంబానీ భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే...

ముంబై: భారత్‌లో కరోనాపై పోరుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలవాలని దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించింది. పీఎం-కేర్స్ సహాయనిధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తరపున పీఎం కేర్స్- సహాయ నిధికి రూ.500 కోట్లు విరాళంగా అందించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా.. కరోనాను అరికట్టేందుకు కృషి చేస్తున్న గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.5 కోట్ల సాయాన్ని ముఖేష్ అంబానీ ప్రకటించారు. కరోనా వైరస్ కట్టడికి ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని సంస్థ సీఈవో ముఖేష్ అంబానీ స్పష్టం చేసినట్లు సంస్థ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.


ఆదానీ గ్రూప్ కూడా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా పీఎం- కేర్స్ ఫండ్‌కు రూ.100 కోట్లు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనాపై భారత్‌ చేస్తున్న పోరాటానికి అండగా నిలిచేందుకు టాటా గ్రూప్‌ కూడా ఇప్పటికే ముందుకొచ్చిన విషయం విదితమే. టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ సంస్థ అయిన టాటా సన్స్‌ రూ.1,000 కోట్లు, టాటా ట్రస్టు రూ.500 కోట్ల సహాయక ప్యాకేజీని ప్రకటించాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనాను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయార్థం దేశవ్యాప్తంగా ప్రముఖ వ్యాపార సంస్థలు తమ వంతు సహాయాన్ని విరాళంగా ప్రకటిస్తున్నాయి.

Updated Date - 2020-03-31T01:39:34+05:30 IST