కోవిడ్ రెండోసారి సోకితే తీవ్రత పెరిగే అవకాశం : తాజా అధ్యయనం
ABN , First Publish Date - 2020-10-07T23:45:19+05:30 IST
కోవిడ్-19 మహమ్మారి అంతు చిక్కని రీతిలో వేధిస్తోంది. ఈ వ్యాధి రెండోసారి సోకితే తక్కువ ప్రభావం చూపిస్తుందనే వాదనకు బలం లేదని తాజా

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి అంతు చిక్కని రీతిలో వేధిస్తోంది. ఈ వ్యాధి రెండోసారి సోకితే తక్కువ ప్రభావం చూపిస్తుందనే వాదనకు బలం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. యాంటీబాడీస్ ఉన్నప్పటికీ రెండోసారి సోకినపుడు కొందరిలో మొదటిసారి కన్నా ఎక్కువ తీవ్రత కనిపించినట్లు నిర్థరించారు.
ముంబైలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ, ఢిల్లీలోని సీఎస్ఐఆర్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ పరిశోధకులు నిర్వహించిన అద్యయనంలో ఈ వివరాలు తెలిశాయి. ఈ రెండు సైంటిఫిక్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో కలిసి ముంబైలోని కస్తూర్బా హాస్పిటల్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్, పీడీ హిందుజా హాస్పిటల్ నిపుణులు కూడా ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.
ఈ అద్యయనంలో భాగంగా నలుగురు యువ హెల్త్‌కేర్ వర్కర్లను పరిశీలించారు. వీరికి మొదటిసారి స్వల్ప లక్షణాలతో కోవిడ్-19 సోకింది. వీరు కోలుకున్న కొద్ది వారాల తర్వాత మళ్ళీ మరొకసారి ఈ వ్యాధి సోకింది. రెండోసారి తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రిలో చేరి, చికిత్స చేయించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నలుగురిలో ఒకరికి ప్లాస్మా థెరపీ అవసరమైంది. మరొకరు మూడు వారాలపాటు నిత్య కృత్యాలు నిర్వహించలేకపోయారు, ఉద్యోగ విధులకు హాజరు కాలేకపోయారు. దీంతో రెండోసారి సోకినపుడు తక్కువ తీవ్రత ఉంటుందనే వాదన బలహీనపడింది.
ఈ అద్యయనం నిర్వహించిన పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ అనురాగ్ అగర్వాల్ (సీఎస్ఐఆర్-ఐజీఐబీ శాస్త్రవేత్త) మాట్లాడుతూ, కోవిడ్-19 రీ-ఇన్ఫెక్షన్ సంఘటనలకు సంబంధించిన ఆధారాలు అత్యంత అరుదుగా కనిపిస్తున్నాయన్నారు. ఈ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత కూడా ప్రజలు, వైద్యులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తమ అధ్యయనంలో స్పష్టంగా వెల్లడైందని తెలిపారు.
రోగ నిరోధక శక్తికి హామీ లేదని, వైరస్ నుంచి రక్షణ స్వల్ప కాలమేనని, అత్యంత అరుదుగానే అయినప్పటికీ, మరొకసారి ఈ వ్యాధి తీవ్రంగా సోకే అవకాశం ఉందని తమ అధ్యయనంలో వెల్లడైందని చెప్పారు.
స్వల్ప లక్షణాలతో కోవిడ్-19 సోకినపుడు కోలుకున్నవారికి రోగ నిరోధక శక్తి స్వల్పకాలం మాత్రమే ఉంటే, వారికి భవిష్యత్తులో మరోసారి ఈ వ్యాధి సోకడం సాధారణ విషయం అవుతుందని ఈ అధ్యయనం పేర్కొంది.