సంస్కరించడమంటే రద్దు చేయడం కాదు : కార్మిక చట్టాలపై నీతీ ఆయోగ్ వీసీ

ABN , First Publish Date - 2020-05-24T22:16:04+05:30 IST

కార్మికుల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని

సంస్కరించడమంటే రద్దు చేయడం కాదు : కార్మిక చట్టాలపై నీతీ ఆయోగ్ వీసీ

న్యూఢిల్లీ : కార్మికుల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. కార్మిక చట్టాలను సంస్కరించడమంటే, వాటిని రద్దు చేయడం కాదని తెలిపారు. కార్మిక చట్టాల్లో మార్పులు రాబోతున్నాయన్న ఆందోళన నేపథ్యంలో రాజీవ్ కుమార్ కాస్త భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు .


రాజీవ్ కుమార్ ఆదివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, భారత దేశం అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ)లో సభ్య దేశమని తెలిపారు. అందువల్ల కార్మిక చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయజాలవని చెప్పారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ విషయాన్నే రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడంలో దృఢ వైఖరిని అవలంబిస్తున్నట్లు తాను ఇటీవల గమనించానని తెలిపారు. 


కార్మిక చట్టాలను సంస్కరించడమంటే, అవి పూర్తిగా లేకపోవడమని కేంద్ర ప్రభుత్వం భావించడం లేదన్నారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 


Updated Date - 2020-05-24T22:16:04+05:30 IST