లక్షపైగా తగ్గిన పరీక్షలు..
ABN , First Publish Date - 2020-08-22T08:03:39+05:30 IST
న్యూఢిల్లీ, ఆగస్టు 21(ఆంధ్ర జ్యోతి): దేశంలో రోజువారీ కరోనా కేసులు 70 వేలకు దగ్గరగా నమోదవుతుండగా..
భారీగానే కేసులు, మరణాలు
దేశంలో వైర్‌సతో మరో 983 మంది మృతి..
29 లక్షలు దాటిన బాధితులు
న్యూఢిల్లీ, ఆగస్టు 21(ఆంధ్ర జ్యోతి): దేశంలో రోజువారీ కరోనా కేసులు 70 వేలకు దగ్గరగా నమోదవుతుండగా.. మరణాలు వెయ్యికి తగ్గడం లేదు. శుక్రవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 68,898 మంది వైరస్ బారినపడ్డారని.. 983 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో అత్యధికంగా 62,282 మంది కోలుకున్నారని తెలిపింది.
అయితే, బుధవారం (9.18 లక్షల పరీక్షలు, 70 వేల కేసులు)తో పోలిస్తే గురువారం (8.05 లక్షలు) పరీక్షల సంఖ్య లక్షపైగా తక్కువ. బాధితుల సంఖ్యలో వెయ్యి మాత్రమే తేడా ఉండటం గమనార్హం. మరణాల విషయానికి వస్తే.. బుధవారం(977) కంటే గురువారమే ఎక్కువగా నమోదయ్యాయి. మరోవైపు దేశంలో వైరస్ బాధితుల సంఖ్య 29 లక్షలు దాటింది. వీరిలో 21,58,946 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 6.92 లక్షల మంది(యాక్టివ్ కేసులు) చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 74.28 శాతానికి పెరగగా.. మరణాల రేటు 1.89 శాతానికి తగ్గిందని కేంద్రం తెలిపింది.
మహారాష్ట్రలో పోలీసు శాఖను కరోనా కుదిపేస్తోంది. తాజాగా గురువారం ఒక్క రోజే 300 పైగా పోలీసు సిబ్బందికి కరోనా సోకింది. ఐదుగురు చనిపోయారు. 14 మంది అధికారులు సహా ఇప్పటివరకు 136 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ చిన్న తమ్ముడు అస్లాం ఖాన్ (88) కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. పెద్ద తమ్ముడు ఎహ్‌సాన్ ఖాన్(90) లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో విధి నిర్వహణలో ఉండగా..
కరోనా సోకి చనిపోయిన పారిశుధ్య కార్మికుడి కుటుంబానికి సీఎం కేజ్రీవాల్ రూ.కోటి పరిహారం అందించారు. ఈ నెల 14న ఢిల్లీ నుంచి హాంకాంగ్ వెళ్లిన ఎయిరిండియా విమాన ప్రయాణికులు 14 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఈ నెలాఖరు వరకు ఎయిరిండియా విమాన సర్వీసులను నిలిపివేసినట్లు హాంకాంగ్ తెలిపింది.