శ్రీలంక మరో నేపాల్ కావచ్చు: బాలు

ABN , First Publish Date - 2020-07-11T01:39:45+05:30 IST

సేతు సముద్రం ప్రాజెక్టు పనులకు సాధ్యమైనంత త్వరగా తిరిగి ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోదీకి డీఎంకే..

శ్రీలంక మరో నేపాల్ కావచ్చు: బాలు

న్యూఢిల్లీ: సేతు సముద్రం ప్రాజెక్టు పనులకు సాధ్యమైనంత త్వరగా తిరిగి ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోదీకి డీఎంకే విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ నేత టీఆర్ బాలు ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.


'శ్రీలంకలోని కీలక రంగాల్లో చైనా గత కొన్నేళ్లుగా భారీ పెట్టుబడులు పెడుతోంది. ఇది తమిళనాడుకు సుమారు 30 కిలోమీటర్ల దేశంలో ఉన్న పొరుగుదేశం (శ్రీలంక) సార్వభౌమాధికారినికి కూడా ప్రమాదకరం' అని టీఆర్‌ బాలు ఆ లేఖలో పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్‌ హైవేలు, పోర్టులు, రియాల్టీ ప్రాజెక్టులు, కొలంబో పోర్ట్ సిటీ, నోరోచోలై పవర్ స్టేషన్లతో సహా పలు ప్రాజెక్టుల పేరుతో శ్రీలంకలో చైనా 7,048 మిలియన్ డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టిందని ఆయన తెలిపారు.


లంక ప్రధాని మహేంద్ర రాజపక్సే నియోజకవర్గంలోని హోంబన్‌టో పోర్ట్ అంతర్జాతీయ సముద్ర మార్గానికి చాలా దగ్గర్లో ఉందన్నారు. వేలాది కంటెనర్ నౌకలు ఆ మార్గం గుండా వెళ్తాయని తెలిపారు. 2010లో తీసుకున్న రుణాన్ని శ్రీలంక చెల్లించలేక పోవడంతో (డిఫాల్ట్) 2017లో ఆ పోర్టును చైనా స్వాధీనం చేసుకుందని చెప్పారు. పెట్టుబడుల కారణంగా శ్రీలంక ప్రజలు కూడా ఇండియా కంటే చైనానే మిత్ర దేశంగా భావించే అవకాశాలున్నాయని, త్వరలోనే శ్రీలంక మరో నేపాల్ అయ్యే అవకాశాలను కొట్టివేయలేమని ప్రధానికి రాసిన లేఖలో బాలు అప్రమత్తం చేశారు.


వ్యూహాత్మక, భద్రత, తీరప్రాంత ప్రాధాన్యత దృష్ట్యా సేతు సముద్రం ప్రాజెక్టు పనులను ఇంకెంతమాత్రం కేంద్రం జాప్యం చేయరాదని బాలు సూచించారు. 2,400 కోట్ల సేతు సముద్రం ప్రాజెక్టును 2005లో ప్రారంభించారని, జాతీయ భద్రత, ఆర్థికంగా ప్రయోజనకారి అయిన ఈ ప్రాజెక్టు విషయంలో కొన్ని శక్తులు మతపరమైన నమ్మకాల పేరుతో ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థను తప్పుదారి పట్టించినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన షిప్ ఛానెల్ ప్రాజెక్టు కార్యక్రమాలను నిలిపివేయడంలో ఆ శక్తులదే పైచేయి అయిందన్నారు. దక్షిణాది తమిళనాడు తీరం, ముఖ్యంగా ఆడమ్స్ బ్రిడ్జి, సేతు సముద్రం ప్రాంతాల భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాంతాలని, ఇండియా తీరప్రాంత వ్యూహాత్మక లైఫ్‌లైన్‌లో భాగమని, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన గ్లోబల్ సీ లేన్ అని కూడా బాలు ఆ లేఖలో వివరించారు.

Updated Date - 2020-07-11T01:39:45+05:30 IST