స్పీకర్‌ను కలిసేందుకు సీఆర్‌పీఎఫ్ భద్రత కావాలంటున్న రెబల్ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2020-03-14T01:28:21+05:30 IST

మధ్య ప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పతనం అంచుకు చేర్చిన రెబల్ ఎమ్మెల్యేలు ప్రత్యేక భద్రత కోరుతున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింథియాకు మద్దతుగా...

స్పీకర్‌ను కలిసేందుకు సీఆర్‌పీఎఫ్ భద్రత కావాలంటున్న రెబల్ ఎమ్మెల్యేలు

భోపాల్ : మధ్య ప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పతనం అంచుకు చేర్చిన రెబల్ ఎమ్మెల్యేలు ప్రత్యేక భద్రత కోరుతున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింథియాకు మద్దతుగా రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 13 మందికి స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. శుక్ర, శనివారాల్లో తన సమక్షంలో హాజరుకావాలని వీరిని ఆదేశించారు.


ఈ నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రజాపతికి ఓ లేఖ రాశారు. తాము స్పీకర్‌ సమక్షంలో హాజరయ్యేందుకు తమకు కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్) చేత భద్రత కల్పించాలని కోరారు. 


కమల్‌నాథ్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన ఆరుగురు మంత్రులకు, ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. వీరంతా జ్యోతిరాదిత్య సింథియాకు విధేయులు. వీరు మంగళవారం తమ రాజీనామాలను ఈ-మెయిల్ ద్వారా స్పీకర్‌కు పంపించారు. దీంతో 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచుకు చేరింది. 


అయితే తమ బలాన్ని శాసన సభలో నిరూపించుకుంటామని కాంగ్రెస్ చెప్తోంది. తన ప్రభుత్వం పూర్తి పదవీ కాలంపాటు కొనసాగుతుందని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదని, తమ ఆధిక్యతను రుజువు చేసుకుంటామని చెప్తున్నారు. 


Updated Date - 2020-03-14T01:28:21+05:30 IST