బీజేపీకి క్రెడిట్ ఇవ్వడానికి రెడీ : ఉద్ధవ్ థాకరే
ABN , First Publish Date - 2020-12-20T23:42:34+05:30 IST
కంజూర్‌మార్గ్ మెట్రో కార్ షెడ్ తనకు అహంకారానికి సంబంధించిన

ముంబై : కంజూర్‌మార్గ్ మెట్రో కార్ షెడ్ తనకు అహంకారానికి సంబంధించిన అంశం కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి తాను సిద్ధమేనని తెలిపారు. ఆరే కాలనీలో నిర్మించాలనుకున్న ఈ కార్ షెడ్‌ను కంజూర్‌మార్గ్‌లో నిర్మించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
లైవ్ వెబ్ కాస్ట్‌లో ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, ఒకరి ప్రాజెక్టులను మరొకరు దెబ్బతీయడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదన్నారు. కంజూర్ మార్గ్ కార్ షెడ్ భూ వివాదం ప్రజా హితానికి విరుద్ధమన్నారు. ఈ ప్రాజెక్టు క్రెడిట్‌ను ప్రతిపక్షానికి ఇవ్వడానికి తాను సిద్ధమేనని చెప్పారు. ఇది తనకు అహంకారానికి సంబంధించిన విషయం కాదన్నారు. ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పడానికి తగిన దస్తావేజులు ఉన్నాయన్నారు. భూ యాజమాన్యంపై వివాదం ఉంటే, చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునన్నారు.
ఇంటిగ్రేటెడ్ మెట్రో కార్ షెడ్ నిర్మాణానికి కంజూర్ మార్గ్ ప్రాంతంలో 102 ఎకరాలను ముంబై సబర్బన్ జిల్లా కలెక్టర్ కేటాయించారు. ఈ ఆదేశాలను బోంబే హైకోర్టు బుధవారం నిలిపేసింది. ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు జరపవద్దని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఆదేశించింది.