ఏటీఎం నుంచి ఒకసారి రూ.5వేలే!

ABN , First Publish Date - 2020-06-25T07:01:05+05:30 IST

ఏటీఎం నుంచి తీసుకునే నగదుపై ఆంక్షలు విధిస్తారా? ఏటీఎం సేవలను వినియోగించుకుంటున్నందుకు విధించే చార్జీలను మరింత పెంచుతారా? వీటికి సంబంధించి అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి...

ఏటీఎం నుంచి ఒకసారి రూ.5వేలే!

  • ఉచిత లావాదేవీల పరిమితి మించినా..
  • ఎక్కువ సొమ్ము తీసుకున్నా చార్జీలు విధించాలి
  • ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన కమిటీ సూచనలు

న్యూఢిల్లీ, జూన్‌ 24: ఏటీఎం నుంచి తీసుకునే నగదుపై ఆంక్షలు విధిస్తారా? ఏటీఎం సేవలను వినియోగించుకుంటున్నందుకు విధించే చార్జీలను మరింత పెంచుతారా? వీటికి సంబంధించి అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఏర్పాటు చేసిన ఓ కమిటీ ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే నగదుపై ఆంక్షలు విధించాలని, పలు ఏటీఎం సేవల చార్జీలను పెంచాలని సూచించింది. ఒకవేళ ఆర్‌బీఐ వీటికి ఆమోదం తెలిపితే ఖాతాదారులపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఆర్‌బీఐ 2019 జూన్‌లో ఏటీఎం ఇంటర్‌ చార్జీ ఫీజుల స్వరూపాన్ని సమీక్షించే నిమిత్తం ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సారథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని అంశాలను పరిశీలించిన కమిటీ తన సూచనలను నివేదిక రూపంలో ఆర్‌బీఐకి సమర్పించింది. ఈ కమిటీ ఏటీఎం నుంచి ఒకసారి తీసుకునే సొమ్మును రూ.5,000కు పరిమితం చేయాలని, ఒకవేళ ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకున్నా లేదా ఉచిత లావాదేవీల పరిమితి దాటినా చార్జీలు వసూలు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. 2012 నుంచి ఇంటర్‌చార్జ్‌ ఫీజులను పెంచలేదని, ఏటీఎంల నిర్వహణ వ్యయం పెరిగిన నేపథ్యంలో ఏళ్లుగా మార్పులు చేయని ఏటీఎం వినియోగ చార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని కమిటీ సూచించింది. ఎల్‌ శ్రీకాంత్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోగా ఈ సూచనలు వెలుగు చూశాయి.  


భారం ఎంత?

కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారం.. ఉచిత లావాదేవీల పరిమితి తర్వాత నిర్వహించే ఆర్థిక లావాదేవీలపై చార్జీని 16 శాతం పెంచి రూ.15 నుంచి రూ.17కు చేర్చాలి. బ్యాలెన్స్‌ ఎంక్వైరీ లేదా పిన్‌ మార్పు లాంటి ఆర్థికేతర లావాదేవీలపై చార్జీలను రూ.5 నుంచి రూ.7కు పెంచాలి. 10 లక్షలకన్నా తక్కువ జనాభా కలిగిన ప్రాంతాల్లో ఉచిత లావాదేవీల పరిమితిని ఐదు నుంచి ఆరుకు పెంచాలని కమిటీ సూచించింది.  ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీల మిళితం ప్రాతిపదికన చార్జీలను 24ు పెంచాలని సూచించింది. దీని వల్ల ఆర్థిక లావాదేవీల వ్యయం రూ.15కు బదులుగా రూ.18, ఆర్థికేతర లావాదేవీల చార్జీ రూ.5 నుంచి రూ.8కి పెరిగే అవకాశం ఏర్పడనుంది. 


Updated Date - 2020-06-25T07:01:05+05:30 IST