అదిగో..‘నవోదయం’

ABN , First Publish Date - 2020-04-28T06:11:22+05:30 IST

కరోనాను గెలిచామని న్యూజిలాండ్‌ ప్రకటించింది! వూహాన్‌లో ఆఖరు పేషెంట్‌ డిశ్చార్జ్‌ అయిపోయాడు!! చైనాలో బడులన్నీ మళ్లీ పిల్లలతో కళకళలాడుతున్నాయి! స్పెయిన్‌ సర్కారు 14 ఏళ్లలోపు పిల్లల సందడికి ...

అదిగో..‘నవోదయం’

  • వూహాన్‌లో ఆఖరు కరోనా పేషెంట్‌ డిశ్చార్జ్‌
  • చైనావ్యాప్తంగా తెరుచుకున్న పాఠశాలలు
  • వైర్‌సపై గెలిచాం: న్యూజిలాండ్‌ పీఎం
  • ఆస్ట్రేలియాలో ఆంక్షల సడలింపు
  • పలు దేశాల్లో దశలవారీగా ఎత్తివేత

కరోనాను గెలిచామని న్యూజిలాండ్‌ ప్రకటించింది! వూహాన్‌లో ఆఖరు పేషెంట్‌ డిశ్చార్జ్‌ అయిపోయాడు!! చైనాలో బడులన్నీ మళ్లీ పిల్లలతో కళకళలాడుతున్నాయి! స్పెయిన్‌ సర్కారు 14 ఏళ్లలోపు పిల్లల సందడికి ‘లాకు’లెత్తేసింది!! స్కాండినేవియన్‌ దేశాలూ ఆంక్షల అడ్డంకులను సడలిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసుల సంఖ్య 30 లక్షలకు చేరినా.. మృతుల సంఖ్య 2 లక్షలు దాటినా.. ఆ విషాద మేఘాలను దాటి ప్రసరిస్తున్న కాంతికిరణాలివి!!


కష్టాలు కలకాలం ఉండవ్‌! కరోనా అయినా అంతే!! దీనికన్నా ప్రమాదకరమైన వైర్‌సలెన్నింటినో మానవజాతి తట్టుకుని నిలబడింది. ఇప్పుడు కొవిడ్‌-19 ముప్పును కూడా అధిగమించే ప్రయత్నాల్లో నెమ్మదిగా సఫలమవుతోంది. అవును.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయి. వైర్‌సకు పుట్టిల్లయిన వూహాన్‌ (చైనా)లో ఆఖరు పేషెంట్‌ను కూడా విడుదల చేశారు. జనవరి చివరి నుంచి లాక్‌డౌన్‌లో ఉన్న వూహాన్‌లో ఇటీవలే ఆ ఆంక్షలను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే వైరస్‌ బారిన పడినవారికి చికిత్స కొనసాగుతోంది. వారిలో చివరి పేషెంట్‌ను ఇటీవలే ఇంటికి పంపారు. ‘‘వూహాన్‌లో కొత్త కరోనా పేషెంట్ల సంఖ్య సున్నాకు చేరింది’’ అని ఆ దేశ ఆరోగ్య కమిషన్‌ ప్రతినిధి మిఫెంగ్‌ తెలిపారు. వైరస్‌ ఉధృతి తగ్గడంతో దాదాపు 3 నెలల తర్వాత చైనావ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలనూ తెరిచారు. 10 లక్షల మంది విద్యార్థులు మళ్లీ చదువులు మొదలుపెట్టారు. అయితే, స్కూలుకు వచ్చే విద్యార్థులకు ఉచితంగా మాస్కులు ఇవ్వాల్సిన బాధ్యత,  యాజమాన్యాలదే. అంతే కాదు.. విద్యాసంస్థల ప్రాంగణాలను నిత్యం డిస్‌ఇన్ఫెక్ట్‌ చేయాల్సిందే. గేటు దగ్గర థర్మల్‌ స్కానింగ్‌ ఏర్పాట్లు కూడా చేయాలి. కాగా.. గువాంగ్‌ఝౌ ప్రాంతంలో బడికి వచ్చే ప్రతి విద్యార్థికి స్థానిక సర్కారు.. న్యూక్లియిక్‌ యాసిడ్‌ టెస్ట్‌ జరిపించిన తర్వాతే వారిని స్కూల్లోకి అడుగుపెట్టనిచ్చింది. ఇలా మొత్తం 2,08,000 మందికి పరీక్షలు చేసింది. కరోనా వైరస్‌ సోకిందీ లేనిదీ నిర్ధారించే పరీక్ష ఇది.

మేఘాలయలో..

మనదేశంలో కూడా మేఘాలయ రాష్ట్రం పలు సర్వీసులపై ఇన్నాళ్లుగా ఉన్న ఆంక్షలను సడలించింది. ఎలకా్ట్రనిక్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మోటార్‌ మెకానిక్స్‌, కార్పెంటర్ల సేవలకు అనుమతిచ్చింది. హైవేలపై వాహనాలను మరమ్మతు చేసే దుకాణాలను, అలాగే హార్డ్‌వేర్‌ దుకాణాలను తెరవడానికి పచ్చజెండా ఊపింది. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పనులకు అనుమతిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు రెట్టింపయ్యే వేగం తగ్గుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి సడలింపులు త్వరలోనే అమల్లోకి వస్తాయనే ఆశాభావం పలువురిలో వ్యక్తమవుతోంది.




కుదుటపడుతున్న ఐరోపా

యూరప్‌ ఖండంలోని పలు దేశాలు కరోనా తాకిడి నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. ఆంక్షల అడ్డుతెరలు తొలగుతున్నాయి. స్విట్జర్లాండ్‌లో హెయిర్‌ సెలూన్‌లను, ఇతర దుకాణాలను తెరిచారు. వైరస్‌ మళ్లీ వ్యాపించకుండా ఉండేందుకు ఆ దేశ ఆర్మీ రోజుకు 10 లక్షల మాస్కులను సరఫరా చేస్తోంది. ఈ సడలింపుల వల్ల కొత్త కేసులు పెద్దఎత్తున నమోదు కాకపోతే మే 11 నుంచి మరిన్ని దుకాణాలను తెరవాలని ప్రభుత్వం యోచిస్తోంది. నార్వేలో ప్రాథమిక పాఠశాలల్లో ఆరు నుంచి పదేళ్ల పిల్లలకు మళ్లీ పాఠాలు చెప్పడం ప్రారంభించారు. స్పెయిన్‌ కూడా ఇప్పటికే చిన్న పిల్లలు తమ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆడుకోవడానికి అనుమతించిన సంగతి తెలిసిందే. ఇక ఇటలీలో మే 4 నుంచి ఫ్యాక్టరీలు, నిర్మాణ రంగ పనులు ప్రారంభం కానున్నాయి. మే 18 నుంచి దుకాణాలు, మ్యూజియంలు.. జూన్‌ 1 నుంచి రెస్టారెంట్లు, కేఫ్‌ల ప్రారంభానికి అనుమతించారు. ఆస్ట్రియాలో చిన్నచిన్న దుకాణాలను ఏప్రిల్‌ 14 నుంచే తెరిచారు. మిగతావాటిని మే 1 నుంచి తెరవనున్నారు. మే 15 నుంచి రెస్టారెంట్లను కూడా తెరుస్తారు. బెల్జియంలో సెల్ఫ్‌ సర్వీస్‌ దుకాణాలను ఇప్పటికే తెరిచారు. మే 11 నుంచి దేశంలోని అన్ని దుకాణాలను, 18 నుంచి విద్యాలయాలను తెరవాలని ప్రభుత్వం యోచిస్తోంది. క్రొయేషియాలో మాల్స్‌ తప్ప మామూలు దుకాణాలన్నింటినీ తెరిచారు. మే 4 నుంచి మిగిలిన వాణిజ్య సంస్థలను కూడా తెరవనున్నారు. డెన్మార్క్‌లో పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాలను తప్ప స్కూళ్లు, హెయిర్‌సెలూన్లు, పబ్‌లు, రెస్టారెంట్లు తెరిచారు. నెదర్లాండ్స్‌లో ప్రైమరీ స్కూళ్లను మే 11 నుంచి తెరవనున్నారు. మిగతా విద్యాసంస్థలను జూన్‌ 1 నుంచి తెరవనున్నారు. పోలెండ్‌లో అన్ని వాణిజ్యసముదాయాలనూ తెరిచారు. స్కూళ్లను మాత్రం మే 24న తెరవనున్నారు. అమెరికాలోని చాలా రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఇలా.. అన్ని దేశాలూ లాక్‌డౌన్‌ నిబంధనలను క్రమపద్ధతిలో సడలిస్తూ పోతున్నాయి.



1122.. 1175

కరోనాపై తొలిపోరులో తాము గెలిచామని న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెన్‌ ప్రకటించారు. ఆ దేశంలో లాక్‌డౌన్‌ ఆంక్షల స్థాయిని 4 నుంచి మూడుకు తగ్గించారు. అక్కడి సర్కారు తీసుకున్న కఠిన చర్యల వల్ల న్యూజిలాండ్‌లో కేవలం 1122 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వైరస్‌ బారిన పడినవారిలో 19 మంది మాత్రమే మరణించారు. ఆ దేశంలో గత 24 గంటల్లో ఒక్క కేసే నమోదవడంతో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించారు. ఆస్ట్రేలియాలోనూ ఆదివారం 10 కేసులే నమోదయ్యాయి. దీంతో అక్కడ కూడా లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించేందుకు సర్కారు సిద్ధమైంది. ఏప్రిల్‌ 4 నాటికి 5000 యాక్టివ్‌ కేసులుండగా, ఇప్పుడవి 1175కు చేరాయి.  

-సెంట్రల్‌ డెస్క్‌, స్పెషల్‌ డెస్క్


Updated Date - 2020-04-28T06:11:22+05:30 IST